కరోనా చికిత్సకు భారీ బిల్లులు
ABN , First Publish Date - 2020-12-19T07:24:51+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న 141 ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు 1,411 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్య

1,411 ఫిర్యాదులు.. 1,333 పరిష్కారం
ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ నంబరుకు ఏకరువు
హైదరాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న 141 ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు 1,411 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో 277 ఫిర్యాదులు అధిక బిల్లులపైనే ఉన్నట్లు తెలిపింది. భద్రతా ప్రమాణాలు, పారిశుధ్యం, బీమా, ల్యాబ్ పరీక్షల్లో ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారంటూ చాలామంది ఏకరువు పెట్టారు. వీటిలో 1,333 పరిష్కరించామని, 88 పరిష్కరించాల్సి ఉందని వివరించింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రు ల్లో కొవిడ్ చికిత్స అందించేందుకు జూన్ 16 నుంచి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, వీటిలో కొన్ని ఆస్పత్రులు సర్కారు నిర్ణయించిన ధరలను పక్కకుపెట్టి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఓ వాట్సప్ నంబరు ఏర్పాటు చేసి ఫిర్యాదులను పంపాలని సూచించింది. ఆ నంబరుకు జూలైలో 819 ఫిర్యాదులు వచ్చాయి. తర్వాత నుంచి క్రమంగా తగ్గాయి. నవంబరులో నాలుగే ఫిర్యాదులు వచ్చాయి. వైరస్ తీవ్రత లేకపోవడంతో పాటు, చికిత్స అందించే ఆస్పత్రులు పెరిగాయి. పోటీ కారణంగా ధరలను భారీగా తగ్గించాయి.
చర్యలు తీసుకుంటున్నాం.. కోర్టుతో సర్కారు
కరోనా కట్టడికి జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
కరోనాతో రోగుల్లో తలెత్తే మానసిక సమస్యల పరిష్కారానికి గాంధీ, కోఠి, టిమ్స్ ఆస్పత్రుల్లో 30 మంది మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 1వ తేదీ నుంచి రోజుకు 50 వేల పరీక్షలు చేస్తున్నట్లు వివరించింది. 300 సంచార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
నెల ఫిర్యాదులు
జూలై 819
ఆగస్టు 422
సెప్టెంబరు 115
అక్టోబరు 51
నవంబరు 4