నల్లగొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-20T08:27:55+05:30 IST

నల్లగొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్‌ అందక ఓ కొవిడ్‌ పేషెంట్‌ మృతి

నల్లగొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

  • కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ
  • ఆగస్టు 21లోగా నివేదిక సమర్పించాలి
  • కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు


హైదరాబాద్‌/నల్లగొండ, జూలై 19(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్‌ అందక ఓ కొవిడ్‌ పేషెంట్‌ మృతి చెందిన ఘటనపై బాధ్యతారహితంగా మాట్లాడిన సూపరింటెండెంట్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్‌ను ఆదేశించింది. ‘ఆక్సిజన్‌  ఆందక తల్లి కళ్లెదుటే ‘ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కరోనా లక్షణాలతో నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో చేరిన సల్కునూరు గ్రామానికి చెందిన యువకుడిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో తల్లి ఎదుటే అతడు కన్నుమూశాడు. కొడుకు మృతదేహం మీద పడి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చిన కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ప్రచురించింది. ‘‘మేం ఎంతకని చేస్తాం. మేం కూడా మనుషులమే’’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహ వ్యాఖ్యానించారని పేర్కొన్నది. తమకూ చికిత్స సరిగ్గా అందడం లేదని రోగులు వాపోతున్నారని వివరించింది. తనను పరీక్షించేందుకు ఒక్క డాక్టర్‌ కూడా రాలేదని, మందులను నర్సులే తన కాళ్ల వద్ద పెడుతున్నారని 3 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన మరో పేషెంట్‌ వాపోయిన విషయాన్ని ప్రస్తావించింది. 

Updated Date - 2020-07-20T08:27:55+05:30 IST