కడుపు కోతలు ఆపేదెలా!
ABN , First Publish Date - 2020-12-15T08:46:48+05:30 IST
రాష్ట్రంలో పుట్టే ప్రతి పది మంది శిశువుల్లో ఆరేడుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే జన్మిస్తున్నట్లు తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో వెల్లడైంది. ఆపరేషన్ ప్రసవాల

రాష్ట్రంలో 60 శాతం ఆపరేషన్ ప్రసవాలే... జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
సీ సెక్షన్ కాన్పుల్లో దేశంలోనే మూడో స్థానం
రాష్ట్రంలో ప్రతి గంటకూ 30 సిజేరియన్ ఆపరేషన్లు
మిడ్ వైఫరీ నర్సుల సంఖ్యను భారీగా పెంచనున్న సర్కారు
రాబోయే రెండేళ్లలో 1500 మంది మిడ్‌వైఫరీ నర్సులు
ప్రస్తుతం శిక్షణ పొందిన 60 మందితో మంచి ఫలితాలు
వారు ఉన్న ఎంసీహెచ్ కేంద్రాల్లో పెరిగిన సహజ ప్రసవాలు
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పుట్టే ప్రతి పది మంది శిశువుల్లో ఆరేడుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే జన్మిస్తున్నట్లు తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో వెల్లడైంది. ఆపరేషన్ ప్రసవాల సంఖ్య గతంలో కంటే మూడు శాతం పెరిగినట్లు అందులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమౌతోంది. రాబోయే రెండేళ్లలో 1500 మంది మిడ్‌వైఫరీ నర్సులను తయారు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. వారి ద్వారా ఆపరేషన్ ప్రసవాలను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 మంది శిక్షణ పొందిన మిడ్‌వైఫరీ నర్సులు ఎనిమిది ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో పనిజేస్తున్నారు. వారు పనిచేస్తున్న ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. 2017లో ఓ 60 మంది స్టాఫ్‌నర్సులకు నాడు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణ కరీంనగర్‌లో మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇప్పించారు.
లండన్, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన నిపుణులైన మిడ్‌వైఫరీ నర్సులు వారికి ఏడాదిపాటు శిక్షణనిచ్చారు. వారికి రెగ్యులర్ వేతనాలతో పాటు ప్రత్యేకంగా రూ.15 వేల ప్రొత్సాహక నగదు కూడా ఇస్తున్నారు. ఎంసీహెచ్ కేంద్రాల్లో వారికి డ్యూటీలు వేశారు. వారున్న ఎంసీహెచ్ కేంద్రాల్లో సిజేరియన్ సెక్షన్స్ బాగా తగ్గి సహజ ప్రసవాలు బాగా పెరిగాయి.
మరింత మందికి..
శిక్షణ పొందిన 60 మంది మిడ్‌వైఫరీలతో సహజ ప్రసవాలు పెరగడంతో మరో 30 మంది శిక్షణ ఇచ్చారు. మరో 55 మంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. జనవరి నుంచి మరో 120 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. జూన్ నాటికి మరో 120 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రతి గంటకూ 30 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని కొద్ది రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో కూడా వెల్లడైంది.
తాజాగా వచ్చిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో కూడా 60 శాతం సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నట్లు తేలింది. ప్రధానంగా సర్కారీ ఆస్పత్రుల్లో కూడా గతం కంటే 4.5 శాతం సీ సెక్షన్స్ పెరిగినట్లు సర్వే వెల్లడించింది. అందుకే మిడ్‌వైఫరీలను రంగంలోకి దించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సీ సెక్షన్స్‌ను బాగా తగ్గించాలంటే కనీసం 1500 మంది శిక్షణ పొందిన మిడ్‌వైఫరీలను ప్రతి డెలివరీ పాయింట్స్‌లలో నియమిస్తే మంచి ఫలితాలుంటాయన్న నిర్ణయానికి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది.
ఉన్న నర్సులలోనే కొందర్ని ఎంపిక చేసి ఈ మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే దశలవారీగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిజేసే స్టాఫ్ నర్సులనే ఈ మిడ్‌వైఫరీ కోర్సులకు ఎంపిక చేయనున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అత్యధిక శాతం..
దేశంలోనే అత్యంత ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నది తెలంగాణలోనే. రాష్ట్రంలో జరుగుతున్న డెలివరీల్లో 60.7 శాతం సీ సెక్షన్ప్ ఉండగా, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఆ శాతం 50 కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 2015-16 నాటికి ఆపరేషన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, 2019- 20 నాటికి 60.7 శాతానికి పెరిగాయి.
ప్రభుత్వ దవాఖానాల్లో 2015-16 నాటికి 40.3 శాతం సిజేరియన్లు, 59.7 శాతం సాధారణ కాన్పులు జరిగాయి. 2019-20 నాటికి సిజేరియన్‌లు 44.5 శాతానికి పెరిగి, నార్మల్ డెలివరీల సంఖ్య తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే సహజ ప్రసవాల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. అక్కడ జరిగిన ప్రతి వంద ప్రసవాల్లో 82.. ఆపరేషన్ ద్వారానే! గతంలో ఇది 74.5 శాతంగా ఉండేది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలివి..
తొలి ప్రసవం అయితే.. కనీసం 12 గంటలు వేచి చూసి, అప్పటికీ కాన్పు కాకపోతే అప్పుడు సిజేరియన్‌పై నిర్ణయం తీసుకోవాలి. అదే రెండో కాన్పు అయితే.. 10 గంటలు వేచి చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చెబుతున్నాయి.
పురిటి నొప్పులు మొదలైన తర్వాత ప్రతి గంటకూ గర్భంలోని శిశువు ఒక సెంటీమీటర్ మేర బయటకు రావడం తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది. పురిటి నొప్పులు ఆలస్యమైతే సిజేరియన్ తప్పనిసరి కాదంటూ 2018 ఫిబ్రవరి 15న కొత్త మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది.