బడ్జెట్‌ అంచనాలను ఎలా సవరిద్దాం!

ABN , First Publish Date - 2020-11-07T07:11:03+05:30 IST

కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా భారీ నష్టం జరిగిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం సవరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

బడ్జెట్‌ అంచనాలను ఎలా సవరిద్దాం!

కరోనా వల్ల జరిగిన నష్టం ఎంత?

నేడు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

 నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా భారీ నష్టం జరిగిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం సవరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు 2020-2021 బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై  చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు.


ఈ సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వంటి వాటి వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా.. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఆదాయం భారీగా పడిపోయింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ.. వ్యాపార కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఇప్పటికీ అనేక రంగాలు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. దీని ప్రభావం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంపై పడింది.


ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 63,970 కోట్ల ఆదాయం వచ్చినా.. ఇందులో రూ.25,989 కోట్లు అప్పుల రూపంలో తెచ్చినవే ఉన్నాయి.  దీంతో  బడ్జెట్‌లో అంచనా వేసిన మేర లక్ష్యాలను అందుకోవడం సాధ్యం కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను కుదించాలని భావిస్తోంది. సుమారు రూ.50 వేల కోట్ల వరకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. మొదట అంచనా వేసిన 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూ.1.30 లక్షల కోట్లకు పరిమితం చేసే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-11-07T07:11:03+05:30 IST