సంక్రాంతికి ఊరెళ్లేదెలా..?
ABN , First Publish Date - 2020-12-27T07:30:53+05:30 IST
సంబురాల పండుగ సంక్రాంతి సమీపిస్తోంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా పలు కారణాలరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు వెళ్లి ఇంటిల్లిపాదితో

పొరుగు రాష్ట్రాల ప్రజల అంతర్మథనం
పండక్కి అరకొరగానే బస్సులు, రైళ్లు!.. అవి కూడా ఫుల్లు
దక్షిణ మధ్య రైల్వేలో 159 సాధారణ, స్పెషల్ ట్రైన్లు
సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి
సొంతూళ్లకు ఎలా వెళ్లాలోనని నగరవాసుల ఆందోళన
సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులపై స్పష్టత నిల్
మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని ప్రయాణికుల వేడుకోలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సంబురాల పండుగ సంక్రాంతి సమీపిస్తోంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా పలు కారణాలరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు వెళ్లి ఇంటిల్లిపాదితో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని భావిస్తుంటారు. పండుగకు వారం రోజుల ముందే సొంతూళ్లకు చేరేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే ఈసారి నగరం నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల్లోని తమ సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణా కష్టాలు తప్పేలా లేవు. గతంలో మాదిరిగా అందుబాటులో ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేకపోవడం, ఉన్న కొన్నింటిలోనూ రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తి కావడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
గడిచిన సంక్రాంతికి 456 రైళ్లు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 5 నుంచి 25 వరకు దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్) పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 456 రైళ్లను నడిపించారు. ఇందులో 256 సంక్రాంతి స్పెషల్ రైళ్లు, 65 జన్‌సాధారణ్, 135 వరకు సువిధ, ఇతర సర్వీసులున్నాయి. వీటితోపాటు రోజువారీగా ఆయా డివిజన్ల పరిధిలో వందలాది రైళ్లు రాకపోకలు సాగించాయి.
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. కొవిడ్ ఆంక్షలకు లోబడి, పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం (ఎస్‌సీఆర్)లో రెగ్యులర్ రైళ్లు రోజుకు 97, పండుగ ప్రత్యేకంగా 62 కలిపి మొత్తం 159 రైళ్లను నడిపిస్తున్నారు. దానాపూర్, సిర్పూర్ కాగజ్ నగర్, తెలంగాణ, గోదావరి, గౌతమి, యశ్వంత్‌పూర్, గోల్కొండ, ఫలక్‌నుమా, విశాఖ, నవజీవన్, దేవగిరితోపాటు పలు స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు నుంచి డిసెంబరు మొదటివారం వరకు సుమారు 750 వరకు రైళ్లను నడిపించిన ఎస్‌సీఆర్.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 20 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి మీదుగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతికి వెళ్లే పలు రైళ్లలో రిజర్వేషన్ సీట్లన్నీ నిండిపోయాయి.
గ్రేటర్‌లో ఇప్పటికే తగ్గిన బస్సులు
సంక్రాంతి పండుగకు టీఎ్‌సఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంక్రాంతికి 3,600 పైగా ప్రత్యేక సర్వీసులను నడిపించారు. కానీ.. రానున్న సంక్రాంతికి నడపనున్న ప్రత్యేక సర్వీసులపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదు. ఏపీ ఆర్టీసీ ఇప్పటికే సంకాంత్రికి 1500 పైగా ప్రత్యేక బస్సులు తెలంగాణకు నడుపుతున్నట్లు ప్రకటించడంతో వాటిఓ టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎ్‌సలనుంచి 4 వేల సర్వీసులు...
ఎంజీబీఎ్‌స, జేబీఎ్‌సల నుంచి తెలుగురాష్ట్రాలకు రోజూ 4 వేలకు పైగా సర్వీసుల్ని ఆర్టీసీ నడుపుతోంది. కొవిడ్ కారణంగా 6 నెలల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటీవల నగరానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంజీబీఎస్ నుంచి 2800, జేబీఎస్ నుంచి 1500 పైగా సర్వీసులు ఆర్టీసీ నడుపుతోంది. ఇక సంకాంత్రి ప్రత్యేక సర్వీసుల వివరాలను జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశాలుంటాయని ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి తెలిపారు.