వైద్యులపై ఎన్ని దాడులు జరిగాయి?
ABN , First Publish Date - 2020-04-25T08:28:48+05:30 IST
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వద్ద వైద్యులు, సిబ్బంది రక్షణకు ఎంతమంది పోలీసులను నియమించారో వివరిస్తూ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వారి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు?
రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వద్ద వైద్యులు, సిబ్బంది రక్షణకు ఎంతమంది పోలీసులను నియమించారో వివరిస్తూ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కొవిడ్-19 పీడితులకు వైద్యంచేస్తున్న డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని కోరుతూ కైలా్‌సనాథ్ అనే వ్యక్తితో మరో ఇద్దరు హైకోర్టు సీజేకి రాసిన లేఖలను సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున అదనపు డీజీపీ రాజీవ్‌రతన్ కౌంటర్ దాఖలు చేశారు.
ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై దాడులకు దిగే వారికి ఏడేళ్లదాకా శిక్షపడేలా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని కోర్టుకు తెలిపారు. వైద్యులకు రక్షణను పెంచామని చెబుతున్నారేగానీ... ఎంత మందిని నియమించారో ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. ‘హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే వైద్యులపై ఇప్పటిదాకా దాడి ఘటనలు ఎన్ని జరిగాయన్నది స్పష్టంగా చెప్పలేదని’ ధర్మాసనం వ్యాఖ్యానించింది. డాక్టర్లతోపాటు పారామెడికల్ సిబ్బంది అందరికీ తగిన రక్షణ కల్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఏర్పాటు చేసే డిజ్‌ఇన్ఫ్‌క్ట్ టన్నెల్స్‌లో ‘హైపోక్లోరైడ్’ ద్రావణం స్ర్పే చేయడం వల్ల చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా మరేదైనా మార్గం ఉందో లేదో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. దీనిపై ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్‌తో చర్చించి డిజ్‌ఇన్ఫ్‌క్ట్ టన్నెల్స్ ద్వారా ప్రమాదరహిత ద్రావణాన్ని స్ర్పే చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైకోర్టులో రెండు టన్నెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధతతో వాటిని నిలుపుదల చేసినట్లు’ సీజే వివరించారు. డిజ్‌ఇన్ఫ్‌క్ట్ టన్నెల్స్‌లో ‘హైపోక్లోరైడ్’ ద్రావణానికి ప్రత్యామ్నాయంగా మరేదైనా ఉందేమో చెప్పాలని ఏజీకి సూచించారు.
‘కోత’ను ఎలా సమర్ధించుకుంటారు?
విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లలో 25శాతం కోత విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే చౌహాన్ నేతృత్వంలోనిధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే పెన్షనల్లో 50శాతం కోత విధించడాన్ని ప్రశ్నిస్తూ నారాయణ, గోగినేని లక్ష్మి మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్‌లో 75శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిదని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పెన్షన్లలో 25శాతం కోత విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది