బస్సులు ఎలా నడపాలి?
ABN , First Publish Date - 2020-09-14T09:17:17+05:30 IST
బస్సులు ఎలా నడపాలి?
- రేపు ఏపీ, తెలంగాణ మధ్య చర్చలు
- ఎండీల స్థాయిలో నిర్వహణ
- విజయవాడ, విశాఖలో త్వరలో సిటీ బస్సులు : కృష్ణబాబు
విజయవాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు బస్సులు నడిపే విషయంలో రెండు రాష్ర్టాల రోడ్డు రవాణా సంస్థల ఎండీల స్థాయిలో మంగళవారం సమావేశం జరగనున్నదని, అందులో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు రాష్ర్టాలు సమాన ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, కానీ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బస్సులను ఏపీ తగ్గించుకుని, తెలంగాణ పెంచుకోకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. మధ్యలో ప్రైవేటు బస్సులు కూడా పెరిగే అవకాశం ఉన్నందునే తెలంగాణను బస్సులు పెంచుకోమంటున్నామని చెప్పారు. ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్‌లాక్-3 మార్గదర్శకాల ప్రకారం అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇచ్చిన తర్వాత తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిసా తదితర రాష్ర్టాలకు అనుమతుల కోసం అడిగామన్నారు.
కర్ణాటక అనుమతులు ఇచ్చినందున అక్కడికి బస్సులు నడుస్తున్నాయన్నారు. కరోనా కేసుల రీత్యా తమిళనాడు, ఒడిసా అనుమతులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య జరిగిన చర్చల ప్రకారం ఏపీ బస్సులను తెలంగాణలో 2.65 లక్షల కిలోమీటర్లకు కుదించామని, తెలంగాణ బస్సులు ఏపీలో 1.52 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ 1.1 లక్షల కిలోమీటర్ల వ్యత్యాసం ఉందన్నారు. కాబట్టి మేము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, మీరు 50 వేల కిలోమీటర్లు పెంచుకోండి అని చెప్పామని వివరించారు. ఇన్ని బస్సులు తిప్పుతున్నా బయట ప్రైవేటు బస్సులు 700 పైచిలుకు నడుస్తున్నాయన్నారు. ఇంకా బస్సులు తగ్గించుకుంటే మరో 200 ప్రైవేటు బస్సులకు ఆస్కారం కల్పించినట్టు అవుతుందన్నారు. తెలంగాణ మాత్రం తాము కొత్త బస్సులను కొనే పరిస్థితి లేదు... ఏపీనే తగ్గించుకోవాలంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎండీల స్థాయిలో తెలంగాణలో సమావేశం జరగనుందని, ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని కృష్ణబాబు చెప్పారు.