ఎల్ఆర్ఎస్ ధరఖాస్తుకు ఎన్ని కష్టాలో?
ABN , First Publish Date - 2020-09-16T06:17:15+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసినవారు.. అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్లు కలిగినవారు.. ప్రభుత్వం ఇచ్చిన

ప్రాథమిక దశలోనే పాట్లు
సర్వర్‌డౌన్‌తో పడిగాపులు
ఎడిట్ ఆప్షన్ లేక తప్పులు సరిచేసే చాన్స్ మిస్
మీసేవా, సీఎస్‌సీలలో అవగాహన లేని సిబ్బంది
అర్హత, అనర్హతలను పట్టించుకోకుండా వివరాల నమోదు
ఫార్మాట్లో కనిపించని ప్రాంతాల జాబితా
ఎల్ఆర్ఎస్పై మేళాలను నిర్వహించని కార్పొరేషన్
హన్మకొండ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసినవారు.. అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్లు కలిగినవారు.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తులు చేసుకునేందుకు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. అయితే దరఖాస్తు దశలోనే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ఆర్ఎస్ చేయించుకునే విషయంలో సరైన అవగాహన లేక అయోమయంలో పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు దాఖలు చేసేందుకు మీసేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)లకు పరుగులు పెడుతున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుతో పాటు ఏ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందనే విషయంలో పూర్తి సమాచారం లేకపోవడంతో తీరా మీసేవా, సీఎస్‌ఎస్‌ల వద్దకు వెళ్ళిన తర్వాత వారు అడిగినవి ఇవ్వలేకపోతున్నారు. దరఖాస్తులు అప్లోడ్ చేసుకోకుండానే అవసరమైన డాక్యుమెంట్ల కోసం వెనుదిరుగుతున్నారు.
యాంత్రికంగా ఆప్‌లోడ్
మీసేవా-సీఎస్సీలలోని డాటా ఎంట్రీ ఆపరేటర్లలో చాలా మందికి కూడా ఎల్ఆర్ఎస్ గురించిన పూర్తి అవగాహన లేదు. డౌన్లోడ్ చేసిన ఫార్మాట్లో అడిగిన వివరాలనే యాంత్రికంగా అప్లోడ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా వెంచర్ల యజమానుల నుంచి రూ.10,000, వ్యక్తిగత ప్లాట్లదారుల నుంచి రూ.1000లు తీసుకొని వివరాలను యాంత్రికంగా అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసే ముందు స్థలం పూర్వాపరాలను అడిగి తెలుసుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఆ స్థలం ఎల్ఆర్ఎస్కు అర్హమైనదా లేదా అనేది నిర్ధారించుకోవడం లేదు. దరఖాస్తుదారులు కూడా ఆ విషయాన్ని అడగడం లేదు. స్థల వివరాలను దరఖాస్తులో పొందుపరిచే ముందు ఆ స్థలం, లేదా వెంచర్ ఏ బఫర్ జోన్లో ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? నాలామీద ఉందా, చెరువు శిఖం భూమియా, ఎయిర్‌పోర్టు పరిధిలో ఉందా? దేవాదాయశాఖ స్థలమా? మిగులు భూమియా? అది ప్రభుత్వ భూమియా? అసైన్డ్ భూమా, లేదా ఆ స్థలం జీవో నెంబర్ 138 ప్రకారం ప్రొహిబిటరీ ప్రాపర్టీయా అన్నది పరిశీలించడం లేదు.
గుడ్డిగా ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాలను, పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంటున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో టైన్‌ప్లానింగ్ సిబ్బంది పరిశీలనకు వెళ్ళినప్పుడు లోపాలు బయటపడి ఎల్ఆర్ఎస్ కాకుండా పోవచ్చు. లేదా స్థల యజమానికి షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ కావచ్చు. తమ వెంచర్, వ్యక్తిగత ప్లాట్ ఎల్ఆర్ఎస్కు ఎంత వరకు అర్హమైనది నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమమం. ఈ విషయం స్పష్టంగా తెలియచెప్పేవారు లేక, ఎవరిదగ్గరికి వెళ్ళాలో తెలియక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై పూర్తి అవగాహన ఉండేది లైసెన్సుడు సర్వేయర్లు కనుక చివరికి అందరూ వారినే ఆశ్రయించాల్సి వస్తోంది. మీసేవా, సీఎస్‌సీలలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్లు సరిగా పనిచేయడం లేదు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్కోసారి ఒక రోజంతా అక్కడే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఆప్షన్లు ఏవీ?
ఆన్లైన్లో దరఖాస్తుల సందర్భంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ ఫార్మాట్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుదారుడి పేరు, సర్వే నెంబర్, చిరునామా, ఇతర వివరాలల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ తప్పని సరిగా ఉండాలి. కానీ అది లేదు. ఒక సారి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పొరపాట్లను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్‌లేక తీరా క్షేత్రస్థాయి పరీశీలనలో అవి తిరస్కారానికి గురయ్యే ప్రమాదం ఉంది.
స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు దాఖలు చేసిన తర్వాత తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటీ? ఎక్కడ? ఏ దశలో ఉన్నది? చూసుకోవడానికి స్టేటస్ ఆప్షన్ కూడా లేదు. దీంతో భవిష్యత్తులో తమ దరఖాస్తుల స్టేటస్ తెలియక దరఖాస్తుదారులు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ రుసుముతో పాటు వేలకు వేల రూపాయలు క్రమబద్దీకరణ చార్జీలు కట్టిన తర్వాత ఏమీ తెలియకపోతే తమ పరిస్థితి ఏమిటని దరఖాస్తుదారులు మథన పడుతున్నారు.
స్లమ్ ఆప్షన్ లేదు
ఎల్ఆర్ఎస్ ఫార్మాట్లో స్లమ్ ఏరియాల గురించిన ఆప్షనే లేదు. మురికివాడల పరిధిలో ఇళ్ళ స్థలాలు ఉన్నవారికి ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటును ఇచ్చింది. ఈ ఏరియాల్లోని ఇళ్ల స్థలాలకు చదరపు గజానికి రూ.5లు బేసిక్ క్రమబద్దీకరణ చార్జీగా నిర్ణయించింది. దీంతో మురికివాడల్లోని ఎల్‌ఆర్‌ఎస్‌లేని స్థల యజమానులు క్రమబద్దీకరణ కోసం బారులు మీసేవా, సీఎస్సీల వద్ద, లైసెన్సుడు సర్వేయర్ల దగ్గర బారులు తీరుతున్నారు. అయితే వారి వివరాలను ఫార్మాట్లో అప్లోడ్ చేద్దామంటే ఆప్షనే కనిపించడం లేదు. పేరుకు స్లమ్ ఏరియావాసుల స్థలాల క్రమబద్దీకరణకు రాయితీ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా దరఖాస్తుల దాఖలు విషయంలో మాత్రం వారిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.
గ్రామాలు కనిపించడం లేదు
దరఖాస్తుల దాఖలు సందర్భంగా మరో ఇబ్బంది కూడా ఎదురవుతున్నది. ఫార్మాట్లో మండలాలను ఎంపిక చేసిన తర్వాత వాటి పరిధిలో ఉన్న గ్రామాల జాబితాలు రావాలి. కానీ ఫార్మాట్లో ఇవి రావడం లేదు. దరఖాస్తుదారుడి వెంచర్ లేదా వ్యక్తి ప్లాటు ఏ మండలం, ఏ గ్రామంలో ఉన్నది స్పష్టంగా నమోదు చేయాలి. మండలాల జాబితా వస్తోంది కానీ గ్రామాల పేర్లు కనిపించడం లేదు. దీంతో చాలామంది తమ స్థలం ఉన్న గ్రామం పేరు అప్లోడ్ చేయలేకపోవడంతో దరఖాస్తులు అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని మండలాల్లోని కొన్ని గ్రామాల పేర్లు డిస్ప్లే కావడం లేదు. ప్రధానంగా విలీన గ్రామాల పేర్లు అసలే కనిపించడం లేదు.
మేళాలు ఏవీ?
ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేళాలను నిర్వహించాల్సి ఉండగా వాటి జాడే లేదు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 4వ తేదీ నుంచే ప్రారంభమైంది. గతంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఎల్ఆర్ఎస్ చేసేది. ఈ సారి ఆ బాధ్యతను వరంగల్ మహానగర పాలక సంస్థ పట్టుబట్టి మరీ తీసుకున్నది. క్రమబద్దీకరణ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుండడంతో ఎల్ఆర్ఎస్ కోసం కార్పొరేషన్ పోటీపడి చివరికి అవకాశాన్ని దక్కించకున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ గురించి అవగాహన శిబిరాలను ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. దరఖాస్తుల దాఖలుకు వచ్చే నెల 15వ తేదీ ఆఖరు గడువు. కార్పొరేషన్ ఈ పాటికే తన పరిధిలోని అన్ని డివిజన్లు, విలీన గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించాలి. పూర్తి సమాచారంతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను తెరవాలి. టౌన్‌ప్లానింగ్ సిఐ్బందికి, థర్డ్ పార్టీ కింద నియమించుకునే బీటెక్ (సివిల్) పట్టభద్రులకు శిక్షణ ఇవ్వాలి. కానీ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనపించడం లేదు. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దాఖలుకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ధరఖాస్తుదారులు అయోమయానికి లోనవుతున్నారు.
ఎడిట్ ఆప్షన్ ఉండాలి..అయిత శ్రీనివాస్, హన్మకొండ
ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాటును దొర్లిన తప్పులను, అక్షర దోషాలను సరి చేసుకునేందుకు వీలుగా ఫార్మాట్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఉండాలి. లేకుంటే పరిశీలనలో అవి తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల స్థల యజమానులు భవిష్యత్తులో ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన కనీస అవగాహనను మీసేవా, సీఎస్‌సీలలో పని చేసే సిబ్బందికి కలిగించాలి. శిక్షణ ఇవ్వాలి.
ఎల్ఆర్ఎస్పై ప్రజల్లో అవగాహన కల్పించాలి..శీలం యాదగిరి, సామాజిక కార్యకర్త, హన్మకొండ
ఎల్ఆర్ఎస్పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. అవగాహన లేక ప్రస్తుతం ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. దీనిని తొలగించడానికి నగరంలోని అన్ని డివిజన్లలో ఎల్ఆర్ఎస్ మేళాను ఏర్పాటు చేయాలి. వీలైతే ఈ మేళాల్లోనే స్థల యజమానుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలి. అక్కడే ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేయాలి. క్రమబద్దీకరణ రుసుము ఎంత చెల్లించాలనే విషయంలో స్పష్టత లేక స్థలయజమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈవిషయంలో వివరాలు తెలియచేయడానికి ప్రత్యేకాధికారిని నియమించాలి. ఇందుకు కార్పొరేషన్లో సెల్ ఏర్పాటు చేయాలి.
ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహిస్తాం..గుండా ప్రకాశ్‌రావు, మేయర్, వరంగల్ మహానగర పాలక సంస్థ
ఎల్ఆర్ఎస్ పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు త్వరలో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎల్ఆర్ఎస్ మేళాను నిర్వహిస్తాము. ఇందులో ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను ప్రజలకు వివరిస్తారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోగదలిచిన వెంచర్ల యజమానులు, వ్యక్తిగత ప్లాట్లదారులు ఈ మేళాలకు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైన పట్టణ ప్రణాళికా సిబ్బందిని అందుబాటులో ఉంచుతాము. ఎల్ఆర్ఎస్ గురించి సందేహాల నివృత్తికి, సమాచారం అందచేయడానికి కార్పొరేషన్ కార్యాలయంలో అవసరమైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేస్తాము. అర్హులైన వెంచర్‌దారులు, పాట్ల యజమానులు తమ స్థలాలను క్రమబద్దీకరించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఈ మేరకు కమిషనర్, పట్టణ ప్రణాళికా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాను. ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో లాగిన్ సందర్భంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా తొలగిస్తాం. ఫార్మాట్లో ఎడిట్ ఆప్షన్, స్లమ్ ఏరియాలో పరిధిలోని స్థలయజమానులు సైతం ఎల్ఆర్ఎస్కు చగ రూ 5 చొప్పున చేసిక్ చార్జీల చెల్లింపులకు సంబంధించిన ఆప్షన్ఉండేలా కూడా కమిషనర్‌తో చర్చిస్తాను. అర్హులైన స్థల యజమానులు ఎల్ఆర్ఎస్ చేసుకునేదుకు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.