మానసిక రోగుల కోసం హాట్‌లైన్‌

ABN , First Publish Date - 2020-11-03T07:10:53+05:30 IST

కరోనా సోకిన తర్వాత కొందరు మానసికంగా కుంగిపోతుంటే.. ఇంకొందరు తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

మానసిక రోగుల కోసం హాట్‌లైన్‌

 కొవిడ్‌ ఆస్పత్రులు టెలీ కన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలి 

 కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా సోకిన తర్వాత కొందరు మానసికంగా కుంగిపోతుంటే.. ఇంకొందరు తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అప్పటికే మానసిక రుగ్మతలు ఉన్నవారు.. కరోనా సోకిన తర్వాత మరింతగా కుంగిపోతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. మానసిక రుగ్మతలు కలిగిన కొవిడ్‌ రోగులకు ఎలా చికిత్స అందించాలనే దానిపై దిశానిర్దేశం చేసింది. వారి కోసం కరోనా ఆస్పత్రుల్లో హాట్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవారికి వెంటనే చికిత్స అందించాలని పేర్కొంది.


వారు చికిత్సకు సహకరించకుంటే.. మత్తు ఇచ్చి ట్రీట్మెంట్‌ చేయాలని స్పష్టంచేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కొవిడ్‌-19 రోగులను మూడు రకాలుగా కేంద్రంవర్గీకరించింది. ఇందులో మొదటిది.. ‘పాజిటివ్‌’ అని తేలాక మానసిక సమస్యల బారినపడుతున్నవారు. పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్స్‌ (పీటీఎ్‌సడీ) లక్షణాలు కలిగినవారు రెండో రకం. వీరికి ఇన్ఫెక్షన్‌ సోకడానికి ముందు నుంచే మానసిక రుగ్మతలు ఉంటాయి. ఇటువంటి వాళ్లకు కరోనా వచ్చిన తర్వాత లక్షణాలు పునరావృతం కావడమో లేక తీవ్రం కావడమో జరుగుతోంది.

ఇక మూడోది సాధారణ ప్రజలు ఎదుర్కొనే మానసిక సమస్యలు. కరోనా సోకిన తర్వాత తలెత్తే ఆందోళన, చనిపోతామేమో అనే భయం వంటి లక్షణాలన్నీ వీరిలో కనిపిస్తాయి. 

మార్గదర్శకాలివే..

మానసిక రోగులకు ఇంటివద్దే మందులందించాలి. క్లినికల్‌ కన్సల్టేషన్‌ అవసరమయ్యే రోగులకు ఇంటి వద్దే చికిత్స అందించాలి. రోగులు వైద్యుడి సలహా లేకుండా మానసిక రుగ్మతల మందుల వాడకాన్ని ఆపకూడదు. టెలీ కన్సల్టేషన్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఆస్పత్రి సందర్శనలను నివారించాలి. టెలీ మెడిసిన్‌ లేదా టెలీ సైకియాట్రీ సేవలు, టెలీ సైకోథెరపీ సెషన్లను ఏర్పాటుచేయాలి. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప రోగులు ఆస్పత్రిని సందర్శించవద్దని చెప్పాలి.


Updated Date - 2020-11-03T07:10:53+05:30 IST