హోటల్ బిల్లు.. జేబుకు చిల్లు!
ABN , First Publish Date - 2020-06-11T08:28:37+05:30 IST
హోటల్ బిల్లు.. జేబుకు చిల్లు!

ఆహారప్రియులకు షాకిస్తున్న రెస్టారెంట్లు.. 10-25 పెరిగిన ధరలు
ఆన్‌లైన్ ఆర్డర్లపైనా పెరిగిన భారం
హైదరాబాద్ సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే అడుగు బైటపెడుతున్న జనాన్ని ధరల పిడుగులు హడలెత్తిస్తున్నాయి. కొత్త రుచుల కోసం రెస్టారెంట్లకు వెళ్లాలంటే.. పెరిగిన ధరలతో జేబుకు చిల్లులు పడుతున్నాయి. దీంతో.. ఇన్నాళ్లూ ఇంటి భోజనంతో మొహం మొత్తిన ఆహార ప్రియులు.. కొత్త రుచులను ఆస్వాదించేందుకు అటు గా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బిల్లు చూసి షాకవుతున్నారు. లాక్‌డౌన్ క్రితంతో పోల్చితే.. ప్రస్తు తం 10 నుంచి 25 శాతం వరకు ఆహార ధరలు పెరిగాయి. చిన్న రెస్టారెంట్ల నుంచి ఖరీదైన స్టార్ హోటళ్ల వరకు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ బండ్ల నుంచి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల వరకు అన్నింటా ఇదే పరిస్థితి. లాక్‌డౌన్ ప్రభావంతో అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి వర్గాలపై ఇది మరింత భారం మోపుతోంది.
అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లి వరకు ఒకే తీరు
అమీర్‌పేట, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లోని పెద్ద రెస్టారెంట్లలో గతంలో ఇడ్లీ, దోశ, పూరీ ధరలు గతంలో రూ. 50, రూ. 78 ఉండగా ఇప్పుడు 10 శాతం పెరిగి రూ. 55, రూ. 85కు చేరింది. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లలో ఇడ్లీ ధరలు 50 శాతం పెరగ్గా, పూరీ, దోశ లాంటివి 40 శాతం పెరిగాయి. కాఫీ, టీ ధరలు కూడా 10 నుంచి 25 శాతం పెరిగాయి. బిర్యానీ ధరలు కూడా భారీగానే పెంచేశారు. గతంలో రూ.110 ఉన్న ప్లేట్ బిర్యానీ.. ఇప్పుడు రూ. 135కి చేరింది. గతంలో రూ.100గా ఉన్న ఫుల్‌మీల్స్ శాఖాహార భోజనం ధర.. ఇప్పుడు ఏకంగా రూ.140కి చేరుకుంది. అలాగే.. చికెన్, మటన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. అదేమంటే.. వ్యాపారులు కరోనాను కారణంగా చూపెడుతున్నారు.
నిర్వహణ భారం కావడంతోనే..గతంలో రాత్రి 11 గంటల వరకు
నడిచే రెస్టారెంట్లు.. ఇప్పుడు కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఇప్పుడు 8 గంటలకే మూసేయాల్సి వస్తోంది. కరోనా భయంతో జనం కూడా ఒకప్పటిలా హోటళ్లకు రావడం లేదు. అదీగాక.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టేబుల్‌కి ఒక్కరినే కూర్చోబెట్టాల్సి రావడం, వారు వెళ్లిన వెంటనే ఆ టేబుల్‌ను శానిటైజ్ చేయాల్సి వస్తుండడంతో నిర్వహణ భారం కూడా పెరిగింది. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
- ఓ రెస్టారెంట్ యజమాని, కూకట్‌పల్లి
చాలా నష్టపోయాం..
లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం బంద్ కావడంతో చాలా నష్టపోయాం. రెండు నెలలు ఎలాంటి పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. గతంలో రోజుకు 40 నుంచి 50 లీటర్ల పాలతో టీ తయారు చేసేవాళ్లం. ఇప్పుడు కనీసం 15 లీటర్లు కూడా అమ్మే పరిస్థితి లేదు. అందుకే.. రూ.8 ఉన్న టీని రూ.10కి పెంచాల్సి వచ్చింది.
- మల్లేష్, టీ వ్యాపారి, కూకట్‌పల్లి
ఆన్‌లైన్‌లోనూ ఇదే భారం..
సాధారంణంగా ఆన్‌లైన్ కొనుగోళ్లలో డిస్కౌంట్లు పోను కొనుగోలు దారులకు ధరలు తగ్గుతుంటాయి. దీంతో..
నగరవాసులు అధికంగా ఆన్‌లైన్ వైపు మొ గ్గుచూపుతుంటారు. కానీ, మారిన ప్రస్తుత స్థితిలో ఆన్‌లైన్ కస్టమర్లకూ భారం తప్పడంలేదు. ఫుడ్ కోసం ఆర్డరిస్తే.. డెలివరీ చార్జీల రూపంలో ఆయా కంపెనీలు 20 శాతానికి పైగా అదనంగా వసూలు చేస్తున్నాయి.