ఆస్పత్రులకు అగ్ని గండం!
ABN , First Publish Date - 2020-08-11T08:49:39+05:30 IST
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో గత ఏడాది అగ్నిప్రమాదం చోటుచేసుకుని, ఓ చిన్నారి దుర్మరణంపాలవ్వగా..

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్, హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో గత ఏడాది అగ్నిప్రమాదం చోటుచేసుకుని, ఓ చిన్నారి దుర్మరణంపాలవ్వగా.. పలు పసిప్రాణాలు దట్టమైన పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యాయి. అభంశుభం తెలియని చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. అంతకు ముందు సోమాజిగూడలోని పార్క్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో పలువురు మృత్యువాతపడ్డారు. షైన్ ఆస్పత్రి ఘటన తర్వాత అధికారులు చర్యలకు ఉపక్రమించినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తనిఖీలు అటకెక్కాయి. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు 1,724 ఆస్పత్రులకు నోటిసులు ఇచ్చారు. భవనానికి అనుమతి ఉందా..? పర్మిషన్ పొందిన ప్లాన్..? ఆక్యుపెన్సీ సర్టిఫికెట్..? ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు తదితర అంశాలపై సమాధానాలివ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులు మాత్రమే.. ఆ నోటీసులకు వివరణలు ఇచ్చాయి. పలు కార్పొరేట్ సహా.. సింహభాగం(80శాతానికి పైగా) ఆస్పత్రులు ఆ నోటీసులను తేలిగ్గా తీసుకున్నాయి. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగిన తాఖీదుల పర్వం.. ఆ తర్వాత చర్యలకు దారితీయాల్సి ఉండగా.. మార్చిలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుతో ముందుకు సాగలేదు. తాజాగా విజయవాడ కొవిడ్‌కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం నేపథ్యంలో తనిఖీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఆస్పత్రుల్లో ఉల్లంఘనలను గుర్తించినా.. ఇన్‌పేషెంట్ విభాగాలు నిండిపోయిన నేపథ్యంలో చర్యలకు అవకాశాలు లేకుండా పోయాయి. కనీసం అగ్నిమాపక నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటే.. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించే అవకాశాలుంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు కూడా గతంలో ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదని నివేదిక అందజేశారు. కొందరు డీఎంహెచ్‌వోలు ఫైర్ ఎన్వోసీ లేకుండానే ఆస్పత్రులకు అనుమతులు మంజూరు చేస్తున్నారని వివరించించారు.
కొంపలార్చే.. కొవిడ్ హోటళ్లు..!
రూమ్.. అటాచ్ బాత్రుమ్.. అందులో బెడ్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని, ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కాసుల కోసం హోటళ్లు, లాడ్జీలను కొవిడ్ సెంటర్లుగా మారుస్తూ.. భద్రతకు తిలోదకాలిస్తున్నాయి. ఈ సెంటర్లలో చికిత్సకు రోజుకు రూ. 3వేల నుంచి రూ. 5 వేలు వసూలు చేస్తున్నాయి. వారం రోజుల అద్దెను అడ్వాన్సుగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత నేపథ్యంలో ఇష్టారాజ్యంగా కొవిడ్‌కేర్ సెంటర్లకు తెరతీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 56 హోటళ్లు, లాడ్జిలను కొవిడ్‌కేర్ సెంటర్లుగా మార్చారు. ఫైరింజన్ తిరిగే పరిస్థితి లేని భవనాలు కావడంతో అగ్నిప్రమాదాలు జరిగితే.. లోపలున్నవారి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మినహా మరోమార్గం లేదు. కొన్ని ఆస్పత్రులు అనధికారికంగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
తనిఖీలంటేనే భయం?
ఆస్పత్రుల్లో తనిఖీలంటేనే అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది భయపడుతున్నారు. కరోనా ఆస్పత్రుల్లో తనిఖీలనగానే.. విధులకు డుమ్మా కొడుతున్నారు. ఈ కారణంతోనే.. గడిచిన ఐదు నెలల్లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. విజయవాడ ఉదంతం నేపథ్యంలో.. ఇప్పుడు రెండ్రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ శాఖలో ఇప్పటికే 80 మంది కొవిడ్-19 బారిన పడటంతో.. మిగతావారు కూడా తనిఖీల విధులు వద్దని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. నిజానికి ప్రతినెలా 50 దాకా భవనాలను అగ్నిమాపకశాఖ ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంది. కరోనా కల్లోలం మొదలు.. ఆ తనిఖీలు అటకెక్కాయి. కాగా.. రాష్ట్రంలోని 74 ఆస్పత్రులు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక దశలో ఆరు దరఖాస్తులను తిరస్కరించారు.
ఇవీ.. అగ్నిమాపక శాఖ నిబంధనలు
అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం ఆస్పత్రి భవనాలను నిర్మించాలి. అగ్నిప్రమాదం సంభవిస్తే.. మంటలు ఆర్పేందుకు అవసరమైన పరికరాలు ఫైర్ హైడ్రెంట్స్, ఎయిర్ రిలీజ్ వాల్వ్‌లు, ఫైర్ అలారం, ఫైర్ హోసిల్ బాక్స్‌తోపాటు భవనం విస్తీర్ణం, ఎత్తును బట్టి నిర్ణీత సామర్ధ్యం మేర నీటి ట్యాంక్‌లు ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో ఇవేవీ కనిపించడం లేదు.
ధర్మాస్పత్రుల్లోనూ అంతే..!
హైదరాబాద్‌లోని ధర్మాస్పత్రుల్లో అగ్నిమాపక చర్యలు డొల్లేనని తెలుస్తోంది. ఎక్కడా అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. నిప్పంటుకుంటే ప్రాణాలు పోవాల్సిందేననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణ పరికరాలున్నా.. పూర్తిస్థాయిలో నివారణ చర్యలు అమలవ్వడం లేదు. ఉన్న కొద్దిపాటి పరికరాలను కూడా రెండేళ్లుగా వాడలేదు. నిజానికి నిప్పును ఆర్పే సిలిండర్లను ఆర్నెల్లకోసారి రీఫిల్ చేయించాల్సి ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే.. ఈ పరికరాలు మంటలను ఆర్పుతాయా? అనేది ప్రశ్నార్థకమే.