ఇళ్లకు తోలుకపోతలేరు

ABN , First Publish Date - 2020-06-25T08:24:17+05:30 IST

తల్లికో, తండ్రికో, అన్నకో కరోనా సోకితే విలవిల్లాడిపోతాం. మంచి చికిత్సతో పూర్తి స్వస్థత పొందితే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి కంటికి రెప్పలా

ఇళ్లకు తోలుకపోతలేరు

వైరస్‌ తగ్గినా దవాఖానాల్లోనే 66మంది

ఫోన్లు చేసినా స్పందించని కుటుంబసభ్యులు

గాంధీ, నేచర్‌ క్యూర్‌,  ఆయుష్‌ ఆస్పత్రిలో మగ్గుతున్న అభాగ్యులు


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తల్లికో, తండ్రికో, అన్నకో కరోనా సోకితే విలవిల్లాడిపోతాం. మంచి చికిత్సతో పూర్తి స్వస్థత పొందితే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటాం. అవునా? అయితే, వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నా కొందరిని వారి కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి ఇళ్లకు తీసుకెళ్లడం లేదు. ‘అయ్యా.. మీ వాళ్లు కోలుకున్నారు. ఇంటికి తీసుకెళ్లండి’ అని చెప్పినా ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనన్న భయంతో కుటుంబసభ్యులు తీసుకెళ్లేందుకు ఇస్టపడటం లేదు. గాంధీ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకున్న వారిని ఏ రోజుకు ఆ రోజు డిశ్చార్జి చేస్తుంటారు. పది రోజులుగా కోలుకున్న వారిలో సగటు ఐదారుగురు ఆస్పత్రిలోనే ఉండిపోతున్నారు. బుధవారం వరకు ఇలా మొత్తం 66 మంది అలా ఆస్పత్రిలోనే  ఉండిపోయారు. సొంత కుటుంబీకులే తమను ఇళ్లలోకి రానివ్వకపోవడంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ పాజిటివ్‌ రోగులను వారి ఇళ్లకు తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు ఆస్పత్రుల నుంచి ఫోన్‌ చేసి చెబుతున్నారు. కొంతమంది అటువంటి  కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటున్నా, ఆ తర్వాత స్పందించడం లేదు. ఆస్పత్రికి రావడం లేదు. మరికొందరైతే అసలు లిఫ్ట్‌ చేయడం లేదు. ఇంకొందరైతే ఏకంగా ఫోన్లు స్విచాఫ్‌ చేసి పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంకొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకోండని ఫోన్‌ చేసిన సిబ్బందికి చెబుతున్నారు. ఇక ఇళ్లకు వెళుతున్నవారిలో కొందరికి కూడా నరకం తప్పడం లేదు. వారొస్తేఎక్కడ తమకు వైరస్‌ అంటుకుంటుందోనని చుట్టుపక్కల వారు, అపార్ట్‌మెంట్‌ వాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు తీసుకెళ్లని వారి విషయంలో ఏం చేయాలో తెలియక గాంధీ ఆస్పత్రి వర్గాలు తలపట్టుకుంటున్నాయి. బుధవారం కొంతమందిని అమీర్‌పేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి, వెంగళరావు నగర్‌లోని ఆయుష్‌ ఆస్పత్రికి మరికొంతమందిని పంపారు. అటువంటి వారిని బలవంతంగా బయటకు పంపలేక, వారికి ఆస్పత్రిలోనే భోజనం పెడుతున్నారు. 


కరోనా కనికరించినా...కొడుకులు కాదన్నారు

ఆమె వయసు 93 సంవత్సరాలు. కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకుంది. దీంతో ఏ చింతా లేకుండా కొడుకుల దగ్గరకు వెళ్లొచ్చునని ఆమె భావించింది. అయితే తొమ్మిది పదుల వయసులో ఆమెను కరోనా కనికరించినా కొడుకులు మాత్రం కాదన్నారు.. వృద్ధురాలిని ఇంటికి పంపిస్తామని ఆస్పత్రి సిబ్బంది ఆమె కొడుకులకు సమాచారం ఇచ్చారు. ఆమెను తీసుకెళ్లడానికి  ఎవ్వరూ రావడం లేదు. దాంతో పాపం, ఆమె గాంధీ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ వయసులో నాకు ఇదేం నరకం అంటూ ఆ వృద్ధురాలు బాధపడుతోంది. 

Updated Date - 2020-06-25T08:24:17+05:30 IST