హోంగార్డుల్లో కలవరం

ABN , First Publish Date - 2020-06-21T09:36:44+05:30 IST

పోలీస్‌ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారిలో మొదటగా ఉండేది హోంగార్డులు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఫ్రంట్‌ లైన్‌

హోంగార్డుల్లో కలవరం

  • కొవిడ్‌ కాటుకు ఇప్పటికే ఒకరు బలి
  • ప్రభుత్వం నుంచి అందని సాయం
  • గాంధీలో చికిత్స పొందుతున్న మరికొందరు
  • ఆచరణలోకి రాని హెల్త్‌కార్డు.. ఇతర హామీలు
  • కానిస్టేబుళ్లతో సమానంగా విధులు
  • గౌరవ వేతనం తప్ప ఇతర సదుపాయాలు శూన్యం


హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారిలో మొదటగా ఉండేది హోంగార్డులు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా పనిచేసిన పోలీసుల్లో హోంగార్డులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. గాంధీ, కోరంటి ఆస్పత్రులతోపాటు ఇతర ఆస్పత్రుల వద్ద బందోబస్తు డ్యూటీ చేశారు. కంటైన్మెంట్‌ జోన్లు, చెక్‌ పోస్టుల వద్ద విధులు నిర్వహించిన హోంగార్డుల్ని ఇప్పుడు కరోనా భయం వెంటాడుతోంది. డ్యూటీ సమయంలో కానిస్టేబుళ్లతో సమానంగా పనులు చేయిస్తున్న అధికారులు, ఏదైనా ప్రమాదం ఎదురైతే మాత్రం నిబంధనల పేరుతో వారిని వేరుగా చూస్తుండటం ఇప్పుడు హోంగార్డుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. అధికారులు ఏది ఆదేశించినా మరో ఆలోచన లేకుండా పని చేసిన హోంగార్డులు ఇప్పుడు తమకు జరగరానిదేమైనా జరిగితే కుటుంబం పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు.


కొవిడ్‌తో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పని చేసే హోంగార్డు ఆఫీసర్‌ ఒకరు మృతి చెందారు. ఇంతవరకు ఆయన కుటుంబానికి ఎటువంటి పరిహారం అందలేదు. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరికొంత మంది గాంధీ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో చనిపోయిన తమ తోటి వాడి కుటుంబం పరిస్థితి ఏమిటని, భవిష్యత్తులో తమకు ఏదైనా జరిగితే తమవారి పరిస్థితి ఏంటని హోంగార్డులు మదన పడుతున్నారు. స్వచ్ఛంద సేవల పేరుతో నియామకం జరగడంతో గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్న హోంగార్డులకు హెల్త్‌కార్డులు లేవు. పేరుకు కానిస్టేబుళ్లతో సమానమే అయినా, జబ్బు చేస్తే వారిలా పోలీస్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పరిస్థితి లేదు. హోంగార్డులు, వారి కుటుంబసభ్యులకు ఎలాంటి హెల్త్‌ స్కీం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా స్వచ్ఛంద సేవ కారణంగా కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారు. ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో నెట్టుకొచ్చిన హోంగార్డులకు ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం చొరవతో రూ.23 వేల గౌరవ వేతనం అందుతోంది. ఇది తప్ప వారికి మరేవిధమైన సదుపాయాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సుమా రు 18 వేల మంది హోంగార్డులు పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు.


అమలుకు నోచుకోని హామీలు 

హోంగార్డుల కష్టాలను తీరుస్తానంటూ సీఎం కేసీఆర్‌ 2017లో గౌరవ వేతనం పెంపుతోపాటు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, హెల్త్‌ కార్డు, బస్‌ పాస్‌, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క గౌరవ వేతనం మినహా ఇతర హామీలేవీ ఆచరణలోకి రాలేదని హోంగార్డులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇప్పుడు ప్రాణాంతక వైరస్‌ భయం వెం టాడుతోందని తమకు భరోసా కల్పించే విధంగా ప్రభు త్వ హామీలు అమలు చేయాలని కోరుతున్నారు.


రూ.50 లక్షల పరిహారం డిమాండ్‌

కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నందున తమకు కూడా రూ.50 లక్షలు పరిహారం ఇప్పించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని హోంగార్డులు డిమాండ్‌ చేస్తున్నారు. పోలీస్‌ శాఖకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎంతో కీలకమని అలాంటి క్షేత్రస్థాయిలో మొదటి వరుసలో ఉండి పనిచేసే తమ విషయం లో ఉన్నతాధికారులు, ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-06-21T09:36:44+05:30 IST