ఉద్యోగులకు సెలవులు?

ABN , First Publish Date - 2020-03-19T09:31:24+05:30 IST

కరోనా వైరస్‌ భయాందోళనల నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సచివాలయంతోపాటు ప్రభుత్వ

ఉద్యోగులకు సెలవులు?

సచివాలయానికి సందర్శకుల నిలిపివేత!.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కట్టడి

ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్కానర్లు  

ఫ్లూ లక్షణాలుంటే ‘హోమ్‌ క్వారంటైన్‌’  

కేంద్ర మార్గదర్శకాల అమలుకు సన్నద్ధం

నేడు సీఎం ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం


హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ భయాందోళనల నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సచివాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను నిలిపివేయాలని భావిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయినా.. విదేశాల నుంచి కొన్ని పాజిటివ్‌ కేసులు వచ్చి పడుతున్నాయి.


ఈ కేసుల ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదమున్నందున.. ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తోంది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) రాష్ట్ర కార్యాలయాలను అప్రమత్తం చేస్తోంది. ప్ర స్తుతం సచివాలయం కొనసాగుతున్న బీఆర్‌కే భవన్‌ చాలా ఇరుకుగా ఉంది. ఇది ఒక రకంగా గ్యాదరింగ్‌గా కనిపిస్తున్నందున.. సచివాలయ అధికారులు, సిబ్బందికైనా సెలవులు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో కొన్ని..

  1. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్కానర్లను ఏర్పాటు చేయాలి. హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
  2. కార్యాలయాలకు వచ్చే సందర్శకులను నిలిపివేయాలి. పాస్‌లను వెంటనే రద్దు చేయాలి. అధికారుల అనుమతితో వచ్చే సందర్శకులను పూర్తిగా స్ర్కీన్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలి. 
  3. సమావేశాలను సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించడం మంచిది.  
  4. అవసరమైన సమాచారాన్ని ఈ-మెయిల్‌ ద్వారానే తెప్పించుకోవడంగానీ, పంపించడంగానీ చేయాలి.
  5. కార్యాలయం ఎంట్రీ పాయింట్‌ వద్దే దరఖాస్తులు తీసుకోవడం, ఇవ్వడం వంటివి చేయాలి. 
  6. అధికారులు, సిబ్బంది జ్వరం, అనారోగ్యం, శ్వాససంబంధమైన లక్షణాలు కనిపిస్తే.. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వెంటనే కార్యాలయాలను వదిలి వెళ్లిపోవాలి. ఇళ్లలోనే స్వయంగా క్వారంటైన్‌ చేసుకోవాలి. వీరికి ఉన్నతాధికారులు వెంటనే సెలవులు మంజూరు చేయాలి. 
  7. వయసు పైబడిన ఉద్యోగులు, గర్భిణులు, వివిధ రకాల వైద్యం పొందుతున్న ఉద్యోగులు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

  

థర్మల్‌ స్కానర్లను ఏర్పాటు చేయండి: తెలంగాణ సచివాలయ సంఘం

బీఆర్కే భవన్‌లోని సచివాలయంలో ప్రధాన ద్వారం, లిఫ్టుల వద్ద థర్మల్‌ స్కానర్లను ఏర్పాటు చే యాలని తెలంగాణ సచివాలయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సందర్శకులను నిలిపివేయాలని, వారికి జారీ చేసిన టెంపరరీ పాస్‌లను రద్దు చేయాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేసింది. ఉద్యోగులందరికీ మాస్కు లు, హ్యాండ్‌ శానిటైజర్లను పంపిణీ చేయాలని కోరింది. ఒకవేళ కరోనా పాజిటివ్‌ అని తేలితే.. సదరు ఉద్యోగికి 15 రోజులపాటు లేదా పూర్తిగా నయమయ్యేవరకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని కోరింది. 


ప్రజలారా గుమిగూడొద్దు.. సహకరించండి: సీఎం కేసీఆర్‌

ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సామూహికంగా నిర్వహించే పండుగలు, ఉత్సవాలకు ప్రజలు దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడొద్దని బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంత మంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే ఇళ్లకు పంపించాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-03-19T09:31:24+05:30 IST