భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాలు.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రత్యేక సందేశం
ABN , First Publish Date - 2020-08-22T22:51:52+05:30 IST
గణేశ్ చతుర్థి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేక సందేశమిచ్చారు.
హైదరాబాద్: గణేశ్ చతుర్థి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేక సందేశమిచ్చారు. కరోనా మహమ్మారిని జయించేలా ఆ గణేశుడు అందరినీ అనుగ్రహించాలని ఆయన అభిలషించారు. గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగర్ ఏ విధంగా వేదిక అయ్యిందన్న దానిపై గతాన్ని గుర్తుచేసుకున్నారు. దివంగత నేత టైగర్ ఆలె నరేంద్ర ఆధ్వర్యంలో వ్యతిరేకులను ఎలా ఎదుర్కొంది ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. సందేశం పూర్తి పాఠం...
వినాయక చవితి దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. ఆ విఘ్నేశ్వరుడు విగ్నాలను తొలగించాలని జరుపుకునే పండుగ. స్వాతంత్ర సమరంలో లోకమాన్య తిలక్, ప్రజలు వ్యక్తిగతంగా ఇంట్లో పూజలు జరుపుకోవడమే కాకుండా సామజిక ఉత్సవంగా, సమాజాన్ని ఆధ్యాత్మికం ద్వారా సంఘటిత పర్చాలని ఈ ఉత్సవాలని ప్రారంభించారు.
అదే స్ఫూర్తితో 1979 - 80లో హైదరాబాద్ (భాగ్యనగర్)లో ఈ పండుగను నిర్వహించే ప్రయత్నం చేశారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తర్వాత ఈ ఉత్సవాలు పాత పట్టణానికి పరిమితం కాకుండా మూసి అవతల వైపు ప్రాంతానికి విస్తరించి ఉత్సవం చేయడం ఉత్తమం అని కొందమంది భావించి జాతీయ వాదా పెద్దలు, సంస్థలు ముందుకు వచ్చి ‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవం’ పేరిట 1980 లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి మొట్ట మొదటి అధ్యక్షుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఆర్య సమాజ నాయకుడు వందేమాతరం రామచంద్ర రావుని అధ్యక్షుడిగా చేసి, వారి నాయకత్వంలో ఊరేగింపు ప్రారంభించారు. పాత పట్టణం నుంచి హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించేవారు. మొదటి గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మొజంజాహి మార్కెట్ వేదికగా గణపతి పూజలు నిర్వహించారు. రెండవ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ రామరాజు, ఆ తర్వాత పుల్లా రెడ్డి, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు రాఘవ రెడ్డి కొనసాగుతున్నారు.
ఈ ఉత్సవాలను ప్రారంభించినప్పటి నుంచి మత ఉద్రిక్తలు, పార్టీల అభ్యంతరాలను వీటన్నింటిని ఎదుర్కొని ధైర్య, సాహసాలతో నాయకత్వం వహించిన కీ.శే. మాజీ మంత్రి టైగర్ ఆలె నరేంద్ర పాత్ర చాల ప్రశంసనీయమైనది. అలాగే మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, పురంమీల్, అడ్వకేట్ జనరల్ భరత్ సింగ్ వీరందరూ కూడా చాల క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
ఈ విధంగా ఉత్సవం వైభవోపేతంగా, సాంస్కృతికంగా, ఆట పాటలతో, కులం, మతం, వర్గం, భాష, ప్రాంత, వర్గం, వర్ణం, ధనిక, బీద అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా సుమారుగా 30 నుండి 35 లక్షల మంది పాల్గొని హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించబడే నిమజ్జనాన్ని తిలకించేవారు. చెన్నారెడ్డి కాలం నుంచి ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాగం వేల కొద్ది సిబ్బందితో చాలా పకడ్బందీగా, చాలా సామరస్యంగా నిర్వహించడం అభినందనీయం.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో ఈ విఘ్నాన్ని ఆ విఘ్నేశ్వరుడు త్వరగా తొలగించి, మనందరికీ బుద్ధిని, సిద్ధిని ప్రసాదించి, ధైర్యంతో, విశ్వాసంతో కరోనాపై విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను తప్పకుండా మనందరం పాటించాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికి ‘గణేశ్ చతుర్థి’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.