డిస్కమ్‌లకు హై‘టెన్షన్‌’

ABN , First Publish Date - 2020-09-21T07:52:59+05:30 IST

డిస్కమ్‌లకు హై‘టెన్షన్‌’ పట్టుకుంది. కరోనా దెబ్బతో ప్రధానంగా హెచ్‌టీ రాబడి కుదేలయింది. రాష్ట్రంలో రెండు డిస్కమ్‌ల

డిస్కమ్‌లకు హై‘టెన్షన్‌’

కరోనా దెబ్బతో హెచ్‌టీ, కమర్షియల్‌ కుదేలు..

ఐటీ కంపెనీల ఉద్యోగులకు వర్క్‌  ఫ్రమ్‌ హోం

తగ్గిపోయిన విద్యుత్తు వినియోగం

30 శాతం మేర తగ్గిన ఆదాయం 


హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లకు హై‘టెన్షన్‌’ పట్టుకుంది. కరోనా దెబ్బతో ప్రధానంగా హెచ్‌టీ రాబడి కుదేలయింది. రాష్ట్రంలో రెండు డిస్కమ్‌ల పరిధిలో 12 వేల దాకా హైటెన్షన్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇవే డిస్కమ్‌లకు ప్రాణవాయువులాంటివి. రాష్ట్రంలో 1,51,97,894 విద్యుత్‌ కనె క్షన్లు ఉంటే.. ఇందులో హెచ్‌టీ కనెక్షన్లు కేవలం 12,442 మాత్రమే. వీటి నుంచి వచ్చే ఆదాయం రెండు డిస్కమ్‌ల పరిధిలో కలుపుకొని నెలకు రూ.1100కోట్ల దాకా ఉంటుం ది. మొత్తం ఆదాయంలో వీటి వాటా 35 శాతం పైనే. అయితే కరోనా ప్రభావంతో ఐటీ కంపెనీలన్నీ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు అనుమతినివ్వడం, వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో వినియోగం తగ్గింది.


దాంతో వీటి ద్వారా రావాల్సిన రాబడి పూర్తిగా తగ్గిపోయింది. నెలకు రూ. 1100 కోట్ల దాకా రావాల్సి ఉండగా.. రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లకు కూడా మించి రావడం లేదని అఽధికారులు చెబుతున్నారు. 30 శాతం దాకా తగ్గిపోవడంతో డిస్కమ్‌లకు గుబులు పట్టుకుంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయం కల్పించడం, కొన్ని కంపెనీలు ఏకంగా  2021 జనవరి దాకా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఉంటుందని ప్రకటించడంతో సైబర్‌ సిటీ వంటి ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం పూర్తిగా తగ్గింది. ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. సైబర్‌ సిటీ డివిజన్‌లో నెలకు రూ.120 కోట్ల బిల్లు వస్తుండ గా... అందులో రూ.70 కోట్లు ఐటీ పరిశ్రమలదే. ప్రస్తుతం రూ.60 కోట్లు దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. 2 వేల నుంచి 3 వేల దాకా పరిశ్రమలు పూర్తిస్థాయి లో తెరుచుకోకపోవడం వంటికారణాలతో వినియోగం తగ్గి.. ఆ ప్రభావం విద్యుత్తు సంస్థలపై పడింది. 


తక్కువే అయినా...

రాష్ట్రంలో రెండు డిస్కమ్‌ల పరిధిలో 1.51 కోట్ల మంది వినియోగదారులు ఉంటే... అందులో డిస్కమ్‌లకు ఆదాయం ఇచ్చే వర్గాలు కమర్షియల్‌తో పాటు హెచ్‌టీ వినియోగదారులే. హెచ్‌టీ వినియోగదారుల సంఖ్య 12,442 మాత్ర మే. వినియోగదారుల్లో వీరి వాటా 0.102 ఽశాతం కాగా... ఆదాయంలో 35 శాతం. ఇక వాణిజ్య వినియోగదారులు 13,79,586 కాగా... వీరి వాటా 10.29 శాతం, ఆదాయంలో 15 శాతానికి పైగా ఉంటుంది. దాంతో 50 శాతానికి పైగా ఆదాయం 10.30 శాతం దాకా ఉన్నవారే ఇస్తున్నారు. ఇక ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 95.13 లక్షల మంది వినియోగదారులు ఉండగా... అందులో గృహ వినియోగదారులు 70.97 లక్షల మంది ఉన్నారు. ఇందులో 86 శాతం మంది 200 యూనిట్లలోపు వాడేవారు ఉన్నారు. మిగిలిన 14 శాతం మంది వినియోగం ఎంత ఉంటుందో... సగటు విద్యుత్తు సరఫరాకు అయ్యే వ్యయం అంతా భర్తీ చే స్తారు. వీరి నుంచి వచ్చే లాభం నామమాత్రమే. 


వచ్చే డబ్బంతా కొనుగోళ్లకే...

2019-20లో డిస్కమ్‌ల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌) రూ.35,500 కోట్లు కాగా... అందులో విద్యుత్తు కొనుగోళ్లకు అయిన వ్యయం రూ.32,000 కోట్లు. 2018 జనవరి 1 నుంచి 24 గంటల పాటు వ్యవసాయ రంగానికి కరెంట్‌ సరఫరా చేస్తున్నప్పటికీ ఆ మేర సబ్సిడీని ప్రభుత్వం పెంచలేదు. అయితే విద్యుత్తు డిమాండ్‌ ఏ మేర పెరుగుతుందో... అంతే స్థాయిలో న ష్టాలు పెరుగుతున్నాయి. అసలే నష్టాలతో నడుస్తున్న డిస్కమ్‌లు కరోనా దెబ్బతో ఆదాయం వచ్చే వర్గాలు కూడా దూరం కావడంతో కుదేలవుతున్నాయి. 2021 నవంబరు నెలాఖరు దాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. Updated Date - 2020-09-21T07:52:59+05:30 IST