వైద్య నిర్లక్ష్యం వల్లే రవికుమార్‌ మృతి!

ABN , First Publish Date - 2020-07-14T08:02:43+05:30 IST

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ.. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో

వైద్య నిర్లక్ష్యం వల్లే రవికుమార్‌ మృతి!

  • హైకోర్టు ధర్మాసనం ప్రాథమిక అభిప్రాయం
  • పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఆదేశం

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ.. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో రవికుమార్‌ (26)  మృతి చెందడం వైద్య నిర్లక్ష్యం (మెడికల్‌ నెగ్లిజెన్స్‌)గా కనిపిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీనిపై పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఛాతీ ఆస్పత్రిలో రవికుమార్‌కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చూపారని, వెంటిలేటర్‌ తొలగించడంతో అతడు మృతి చెందాడని, దీనిపై విచారణకు ఆదేశించాలని న్యాయవాది యశ్‌పాల్‌ గౌడ్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్య వైఖరి వల్లే రవికుమార్‌ చనిపోయి ఉంటే.. అందుకు కారణమైనవారు ఎంతటివారైనా చర్యలు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కొవిడ్‌ కారణంగా సంభవించిన మరణంలా లేదని పేర్కొంది. మరోవైపు ఛాతీ ఆస్పత్రి వైద్య సిబ్బంది అకారణంగా వెంటిలేటర్‌ తొలగించారంటూ.. మరణానికి ముందు రవికుమార్‌ తీసిన వీడియోలో రవికుమార్‌ ప్రస్తావించడాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి వైద్యం కోసం ఏడు ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం, ఆ తర్వాత తల్లి, శిశువు మృతి చెందిన ఘటనను కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది.

Updated Date - 2020-07-14T08:02:43+05:30 IST