పరీక్షలు ఎందుకు తగ్గించారు?

ABN , First Publish Date - 2020-09-25T09:42:00+05:30 IST

కరోనా పరీక్షలను తగ్గించడానికి కారణమేమిటని రాష్ట్ర సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన దానికి కట్టుబడి ఉండడం లేదని డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది...

పరీక్షలు ఎందుకు తగ్గించారు?

  • చెప్పిన దానికి కట్టుబడి ఉండరేం?
  • ఆక్సిజన్‌ పడకల సంఖ్య పెంచాలి
  • పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షలను తగ్గించడానికి కారణమేమిటని రాష్ట్ర సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన దానికి కట్టుబడి ఉండడం లేదని డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రోజుకు 1.5లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ...పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. చెప్పినవిధంగా రోజుకు 40వేల పరీక్షలు సైతం చేయడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గించడానికి గల కారణాలు చెప్పాలని, ఆక్సిజన్‌ పడకలు పెంచేందుకున్న తీసుకున్న చర్యలు వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ప్రజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివా్‌సను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. కరోనా వైర్‌సకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని, చనిపోయిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, సూర్యాపేట, నిర్మల్‌ జిల్లాల్లోని రెడ్‌, కంటైన్మెంట్‌ జోన్లలో అందరికీ కరోనా పరీక్షలు చేయాలని కోరుతూ... దాఖలైన సుమారు 20 ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.


ఈ వ్యాజ్యాల్లో అడ్వకేట్‌ జనరల్‌ బీ.ఎస్‌. ప్రసాద్‌ వాదిస్తూ... ప్రజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు పితృ వియోగం జరిగిందని, ఆ కారణంగా కోర్టు ఆదేశాల ప్రకారం సమగ్ర నివేదికను కోర్టుముందుంచ లేకపోతున్నట్లు తెలిపారు. సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఏజీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆక్సిజన్‌ పడకల కొరత ఉన్నట్లు పత్రికల్లో కథనాలు చూస్తున్నామని, పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల ప్రకారం 1000 మంది జనాభాకు కనీసం 5 పడకలు ఉండాల్సి ఉండగా తెలంగాణలో ఒకటి కూడా లేదని తెలిపింది. కనీసం 1000 మందికి 3 పడకలైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కూడిన నివేదికను అక్టోబరు 6లోగా ఇవ్వాలన్న ధర్మాసనం బ్యాచ్‌ పిటిషన్ల విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. 


Updated Date - 2020-09-25T09:42:00+05:30 IST