జల్‌పల్లి మునిసిపల్ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-12-15T07:50:22+05:30 IST
హైదరాబాద్ శివారులోని జల్‌పల్లి మునిసిపాలిటీ కమిషనర్ జి.ప్రవీణ్ కుమార్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేడు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని జల్‌పల్లి మునిసిపాలిటీ కమిషనర్ జి.ప్రవీణ్ కుమార్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలు ఇంకెంతకాలం నీటిలోనే ఉండాలని నిలదీసింది. 2021 వరకూ ఈ ప్రాంతాల్లో నీటిలోనే మునిగి ఉండాలా? అని పురపాలకశాఖ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
ముంపు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ దాఖలైన రెండు వ్యాజ్యాలు సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఇంకెంతకాలం ఆ ప్రాంతాలు నీటిలో మునిగి ఉండాలని ధర్మానసం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో మునిసిపల్ కమిషనర్ జి.ప్రవీణ్ కుమార్ దాఖలు చేసిన కౌంటర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం భౌతికంగా కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది.