యముడికి మీరేమైనా ఆదేశాలిచ్చారా?

ABN , First Publish Date - 2020-10-13T09:40:30+05:30 IST

‘కరోనా పరీక్షలు ఆకస్మికంగా సగానికి ఎందుకు పడిపోయాయో చెప్పాలని కోరితే పొంతన లేని సమాధానం ఇచ్చారు. 45 రోజులుగా కొవిడ్‌ మరణాలపై ప్రభుత్వ బులెటిన్లు నమ్మశక్యంగా లేవు. సెప్టెంబరు

యముడికి మీరేమైనా ఆదేశాలిచ్చారా?

రోజూ పదికి మించి రోగులను తీసుకెళ్లొద్దని కోరారా?

పరీక్షలు తగ్గడంపై రాష్ట్ర ప్రభుత్వం

పొంతన లేని సమాధానాలు

కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు

సరాసరి టెస్టుల సంఖ్య రాసి అతి తెలివి చూపారు

నివేదికను తప్పుపట్టిన హైకోర్టు


హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ‘కరోనా పరీక్షలు ఆకస్మికంగా సగానికి ఎందుకు పడిపోయాయో చెప్పాలని కోరితే పొంతన లేని సమాధానం ఇచ్చారు. 45 రోజులుగా కొవిడ్‌ మరణాలపై ప్రభుత్వ బులెటిన్లు నమ్మశక్యంగా లేవు. సెప్టెంబరు బులెటిన్లను పరిశీలిస్తే.. 20వ తేదీన 1,219, 27వ తేదీన 1,378, 30వ తేదీన 1,127 కేసులు నమోదైనట్లు చూపారు. ఆయా తేదీల్లో మరణాల సంఖ్యను 9, 7, 13గా పేర్కొన్నారు. అక్టోబరులో రోజుకు 10 మంది మరణిస్తున్నట్లు చూపుతున్నారు? ఈ రాష్ట్రంలో రోజుకు 10కి మించి కరోనా రోగులను తీసుకెళ్లవద్దని యముడికి ఆదేశాలు ఇచ్చారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య సిబ్బందికి సౌకర్యాల కల్పన, మృతదేహాలకూ పరీక్షలు చేయాలంటూ దాఖలైన 23 ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. దీనికి సమాధానంగా ప్రభుత్వ చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సమర్పించిన నివేదికను ధర్మాసనం తప్పుపట్టింది. ‘ప్రభుత్వ లెక్కలు షాక్‌ కలిగిస్తున్నాయి.


ప్రజలకు కచ్చితమైన వివరాలు అందించాలి. మరణాలు 10కి మించి చూపడంలేదు. కొవిడ్‌ ఆస్పత్రులు కేవలం 62 ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ. సుమారు 10శాతం జనాభాకే పరీక్షలు చేశారు’ అని పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీల్లో జూలై నుంచి అక్టోబరు వరకు చేసిన పరీక్షలు, వచ్చిన కేసులు, సంభవించిన మరణాలకు తెలంగాణ గణాంకాలతో సరిపోల్చుతూ గ్రాఫ్‌ రూపొందించి కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. నవంబరు 16లోగా పూర్తి వివరాలతో మరో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 19వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలో వైద్య వసతులు  పెంచాలని ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఆక్సిజన్‌ పడకలు 831, ఐసీయూ పడకలు 352 పెంచి సాధారణ పడకలు 367 తగ్గించి ఏం సంకేతాలిస్తున్నారు. వెంటిలేటర్‌ పడకలు 135 పెంచినట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఇది బకెట్‌లో నీటి బొట్టంత కూడా కాదు’ అని ఆక్షేపించింది. ‘ఇదే తీరు కొనసాగితే సీఎస్‌ హాజరుకు ఆదేశించడం తప్ప మరో మార్గం లేదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతమంది కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించారో చెప్పాలని కోరింది. 


3.7 కోట్ల మందికి 23 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లేనా?

కరోనా పరీక్షలు అకస్మాత్తుగా ఎందుకు తగ్గించారో చెప్పాలని గత నెల 24న కోరామని, మీడియా కథనాలపైనా వివరణ అడిగామని.. కానీ నివేదికలో సరాసరిన రోజుకు 54,219 టెస్టులు చేస్తున్నట్లు రాసి.. అతి తెలివి ప్రదర్శించారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 17 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లున్నాయని, మరో 6 ఏర్పాటు చేస్తామని పేర్కొన్నా ఎప్పటిలోగానో చెప్పలేదని.. రాష్ట్రంలో 3.7 కోట్ల జనాభాకు 23 ల్యాబ్‌లు ఏపాటి అని ప్రశ్నించింది.


సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీలు ఆదివారాలు కావడంతో ప్రజలు పరీక్షలకు రాలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ వివరణ ఇవ్వగా.. పని దినాల్లోనూ టెస్టులు తగ్గినట్లు నివేదికలో ఉందని కోర్టు గుర్తుచేసింది. గుర్తించిన కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో లైవ్‌ డాష్‌ బోర్టులు పెడతామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి.. వైద్య, ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు చూపడాన్ని హైకోర్టు నిలదీసింది. కోర్టుకు ఇచ్చిన హామీ తప్పిటనట్లు కాదా? అని ప్రశ్నించింది. నిరుపేదలు, అభాగ్యులు, పుట్‌పాత్‌లపై జీవించేవారికి పరీక్షల కోసం 10 వ్యాన్లు ఎలా సరిపోతాయని అని ప్రశ్నించింది.

Updated Date - 2020-10-13T09:40:30+05:30 IST