రెవెన్యూ అధికారులకు హైకోర్టు అక్షింతలు
ABN , First Publish Date - 2020-10-03T09:41:15+05:30 IST
పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులకు హైకోర్టు అక్షింతలు వేసింది.ఈ-పాస్ పుస్తకాల

పాస్‌పుస్తకాల జారీలో నిర్లక్ష్యం
2వారాల్లో ఇవ్వాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులకు హైకోర్టు అక్షింతలు వేసింది.ఈ-పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేస్తే.. 1978లో జారీ చేసిన ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్‌ను రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో సర్వే నంబర్ 5, 8, 17లోని 13ఎకరాల 21 గుంటల భూమికి బుర్రా వేణుగోపాల్ మరో ఐదుగురు పిటిషనర్లకు.. సర్వే నంబర్ 1 నుంచి 4, 18లో బుర్రా జ్ఞానేశ్వర్‌గౌడ్ మరో 21 మందికి రెండు వారాల్లోగా ఈ-పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించింది. పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యం వహించడంతోపాటు వేరొకరి పేరున భూ మార్పిడికి సహకరించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వాజ్యాల్లోని 28 పిటిషనర్లకు రూ.5 వేల చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. అదే మండలం సికిందర్‌గూడలోని 187ఎకరాల 27గుంటలను ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ సీసీఎల్‌ఏ జారీ చేసిన ప్రోసీడింగ్స్‌నూ రద్దు చేసింది.
ఇదీ నేపథ్యం..
సదరు భూమికి సంబంధించి 1978 మే 8న బుర్రా రామయ్య, బుర్రా సత్తయ్యకు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేశారు. తర్వాత వాటిని వారి వారసులు పంచుకున్నారు. పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందారు. అయితే, ఇటీవల వారు ఈ-పాస్ పుస్తకాల కోసం అధికారులను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన అధికారులు అవన్నీ ప్రభుత్వ భూములేనని ప్రకటిస్తూ గతంలో ఉన్న ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లను సస్పెండ్ చేశారు. ఈ భూమిలో ఇతరులకు హక్కులు కల్పించారు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.