సీమ ప్రాజెక్టుపై రెండు వ్యాజ్యాలు

ABN , First Publish Date - 2020-08-20T09:14:24+05:30 IST

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ పనులను విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ

సీమ ప్రాజెక్టుపై రెండు వ్యాజ్యాలు

  • పునర్విభజన చట్టానికి ఇది వ్యతిరేకం..
  • పిటిషనర్ల వాదనలు
  • 24న విచారణ చేపడతామన్న హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ పనులను విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన రెండు వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు ఈనెల 24న విచారణ చేపట్టనున్నది. ఈ వ్యాజ్యాలను కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్‌ మరో నలుగురు వేర్వేరుగా దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు ఆదేశాలను పెడచెవినపెడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును చేపట్టిందని పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం ఈ వ్యాజ్యాలు ప్రస్తావనకు వచ్చాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 84కు వ్యతిరేకంగా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నదని పిటిషనర్ల తరఫున న్యాయవాది అన్నారు. ఈ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, నల్గొండ, ఖమ్మం రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందదని వారన్నారు.


ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల పిటిషనర్ల హక్కులకు భంగం కలుగుతుందని, తక్షణమే రాయలసీయ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిందని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై 24న సోమవారం విచారణ చేపడతామని  పిటిషనర్లకు స్పష్టం చేసింది. 

Read more