ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌

ABN , First Publish Date - 2020-08-16T20:41:30+05:30 IST

భారీ వర్షాల నేపధ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుబారుతున్నాయి. వాగులు, వంకలు పొంగతి పొర్లుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌

వరంగల్‌: భారీ వర్షాల నేపధ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుబారుతున్నాయి. వాగులు, వంకలు పొంగతి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.కొన్నిచోట్ల రోడ్లు నీటి కోతకు గురయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందన్‌పల్లి గ్రామ శివారులో చలివాగు పొంగి పొర్లి 10 మంది రైతులు తమ పొలాల్లో చిక్కుకుపోయారు. దీంతో హెలీకాప్టర్‌ ద్వారా వారిని రక్షించారు. మరో వైపు ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదుకాగా మరో మూడు రోజుల పాటు ఈ తుఫాన్‌ కొనసాగనున్నదని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌జిల్లాలపై హైదరాబాద్‌లో సమీక్షించారు. రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఫోన్‌ చేశారు. కుందన్‌ పల్లి ఘటనతో పాటు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెంటనే పర్వతగిరిలోని ఉన్నక్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


మహబూబాబాద్‌లో ఉన్న స్ర్తీశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌, మాలోత్‌ కవిత, వరంగల్‌లో ఉన్నఎంపీలు బండ ప్రకాశ్‌,పసునూరి దయాకర్‌, వివిధ జిల్లాల జెడ్పీఛైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు తదితరులు ఈటెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్‌ తనకు ఫోన్‌చేసి ఆరా తీశారని అన్నారు. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రస్తుత పరిస్థితిలను అనుసరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే  కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారని అన్నారు.


ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సోమేశ్‌కుమార్‌ కూడా ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి తాజా పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. వరంగల్‌అర్బన్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని 2,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిమచామని చెప్పారు. మరో ఆరు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించినట్టు చెప్పారు. ములుగు జిల్లాలో 2 గ్రామాలు ముంపునకు గురయ్యాయని మంత్రి తెలిపారు. జనగామ జిల్లాలో 3 చోట్ల ఇండ్లుకూలాయన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఆకేరువాగు పొంగిపొర్లుతున్నందున ఈదులపూసల పల్లి రోడ్డు తెగిందన్నారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా అన్ని తక్షణ, దీర్ఘకాలిక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-08-16T20:41:30+05:30 IST