వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌

ABN , First Publish Date - 2020-08-16T10:00:16+05:30 IST

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించింది.

వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌

మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ వరదలపై దిశానిర్దేశం


హన్మకొండ టౌన్‌, ఆగస్టు 15: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదు కాగా మరో మూడు రోజుల పాటు తుఫాను కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ జిల్లా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్‌ చేసిన కేసీఆర్‌.. జిల్లా పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వర్షాలపై అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, కవిత, పసునూరి దయాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తనకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఆరా తీసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.


ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి తాజా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే 2600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో 2 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, జనగామలో 3 చోట్ల ఇళ్లు కూలాయన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఆకేరు వాగు పొంగిపొ ర్లుతున్నందున ఈదుపూసలపల్లి రోడ్డు తెగిందని తెలిపారు. ఏటిగడ్డ తండాలో రిస్కులో ఉన్న 15మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.


పరకాల మండలం నార్లాపూర్‌కు చెందిన 70మందిని తరలించినట్లు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించినందున గోదావరి తీరప్రాంతాలను అప్రమత్తం చేశామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. వరంగల్‌కు జాతీయ విపత్తుల టీమ్‌లను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి రావొద్దని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు, ఎమర్జెన్సీ టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తుఫాన తీవ్రత తగ్గేవరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు పరిమితం కావాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు అన్ని చర్యలు తీసుకుం టున్న తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు పోన్‌ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

Updated Date - 2020-08-16T10:00:16+05:30 IST