ఈ పేద యాత్రికుడికి సాయం చేయరూ!
ABN , First Publish Date - 2020-06-18T10:04:42+05:30 IST
భార్య, ముగ్గురు పిల్లలతో దేశం కాని దేశం నుంచి విమానంలో హైదరాబాద్‌లో వాలాడు. బాగా ఖర్చు పెట్టి ఓ ఆస్పత్రిలో భార్యకు వైద్యం

భార్యాపిల్లలతో అడుక్కుంటున్న సిరియా వాసి
భార్య చికిత్స కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు
లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయిన కుటుంబం
డబ్బు అయిపోవడంతో సాయం కోసం రోడ్డు మీదకు
హైదరాబాద్ సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): భార్య, ముగ్గురు పిల్లలతో దేశం కాని దేశం నుంచి విమానంలో హైదరాబాద్‌లో వాలాడు. బాగా ఖర్చు పెట్టి ఓ ఆస్పత్రిలో భార్యకు వైద్యం చేయించాడు. నెల తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోదానుకుంటే సాధ్యపడలేదు. నెలలు గడుస్తున్నాయి. హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయాడు. చేతిలో డబ్బులేమో అయిపోయాయి. స్వదేశంలో ఉన్న బంధువుల నుంచి కొంత డబ్బు తెప్పించుకున్నాడు. అదీ అయిపోయింది. డబ్బు పంపేవారు లేక.. భార్యాపిల్లలతో రోడ్డు మీద నిలబడి వచ్చీపోయే వారిని సాయం చేయమని అర్థిస్తున్నాడు!! సిరియాకు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి దీనగాథ ఇది. భార్యకు వైద్యం చేయించేందుకు ఫిబ్రవరి చివరివారంలో మహమ్మద్ హైదరాబాద్‌కు వచ్చాడు. భార్యకు వైద్యం చేయించాడు. మార్చి చివరి వారంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు.
లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. కూకట్‌పల్లి వై జంక్షన్ పరిసర ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. రోజూ భార్య, ముగ్గురు పిల్లలతో రోడ్డు మీదకు వస్తున్నాడు. ‘‘సిరియాకు చెందిన పేద యాత్రికుడికి సాయం చేయండి’’ అని ఇంగ్లిషులో రాసివున్న ఓ కాగితాన్ని పట్టుకొని కూడళ్ల వద్ద నిల్చుంటున్నాడు. అతడి పరిస్థితికి చలించిన కొందరు ఎంతో కొంత ఇస్తుండటంతో నెల రోజులుగా ఎలాగో అలా తమకు గడుస్తోందని చెప్పాడు. మహమ్మద్‌కు అరబిక్ తప్ప వేరే భాష కూడా రాకపోవడంతో అతడి సమస్యను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎలాగో అలా కాలం గడిపి.. కరోనా పరిస్థితి శాంతించి.. ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా విమనాలు తిరగగలిగితే తమదేశానికి వెళ్లి పోతానని చెబుతున్నాడు.