ఎత్తుల కత్తులు
ABN , First Publish Date - 2020-11-25T07:06:17+05:30 IST
ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని ఇతర పార్టీలు విలవిలలాడుతూ ఉండేవి! ఇప్పుడు అందుకు భిన్నమైన

గ్రేటర్లో ఊహించని వ్యూహాలు
కమలం విమర్శలకు కారు ప్రతివిమర్శలు
ఆ పార్టీయే ప్రధాన ప్రత్యర్థనే సంకేతాలు
కమలం వేసిన బాటలో కారు పయనం
బీజేపీ ప్లాన్ అదేనంటున్న విశ్లేషకులు
కాంగ్రెస్‌ను బలహీనపరచడమే లక్ష్యం
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని ఇతర పార్టీలు విలవిలలాడుతూ ఉండేవి! ఇప్పుడు అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొందా!? కమలం వేస్తున్న బాటలో కారు పయనిస్తోందా!? గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘బీజేపీ మా ప్రధాన ప్రత్యర్థి’ అని ప్రకటించిన టీఆర్‌ఎస్.. ఈసారి తమకు మద్దతుదారుగా ఉండే మజ్లి్‌సను ప్రధాన పోటీదారుగా ప్రకటించడం వెనక ఉద్దేశం ఏమిటి!? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలివి! ఇటీవల ముగిసిన దుబ్బాకతోపాటు తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారమే ఇందుకు కారణం. రాష్ట్రంలో గులాబీ దళానికి కమలం పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు బయటకు అంగీకరించినా, అంగీకరించకపోయినా వారి చేతల ద్వారా మాత్రం స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని మంత్రి తలసాని; తమ ప్రధాన పోటీదారు మజ్లిస్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రధానంగా బీజేపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ అభివృద్ధి అజెండాను పక్కకుపెట్టి.. బీజేపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాల్సి వస్తోందని, తద్వారా తమకు బీజేపీతోనే ప్రధాన పోటీ అనే సంకేతాన్ని బయటకు చెప్పినట్టయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాల తర్వాత మజ్లిస్ అభ్యర్థి మేయర్ అవుతారని, టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తే.. మజ్లి్‌సతో తమకు పొత్తు లేదని మంత్రి కేటీఆర్.. టీఆర్‌ఎ్‌సను ఓడిస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ప్రకటించిన విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వరద సాయంపై బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసరడాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన విసిరిన సవాల్‌ను టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ స్వీకరించలేదని, కానీ, ఆ తర్వాత ప్రచారం మొత్తం ‘విద్వేష రాజకీయాల’ చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో బీజేపీ నేతలు అతిగా చేసే వ్యాఖ్యలకు కూడా టీఆర్‌ఎస్ నేతలు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని, బండి సంజయ్ చలాన్లు, సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలకు స్పందించడమే దీనికి నిదర్శనమని చెబుతున్నాయి. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని కూడా విమర్శిస్తున్నారు. కేంద్ర నిర్ణయాలను తప్పుబడుతున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించడమే దీని లక్ష్యమైనా.. అది పంపే సంకేతాలు మాత్రం భిన్నం’’ అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రణాళిక కూడా ఇదే
తమను ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ గుర్తించడమంటే పోటీలో తామే ఉన్నట్టు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లినట్టేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. తద్వారా, దుబ్బాక తరహాలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ లబ్ధి పొందుతామని భావిస్తున్నారు. ఈ దిశగా కమలనాథులు అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఉదాహరణకు, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ ఇంట్లో డబ్బులు దొరికినప్పుడు అవి పోలీసులు పెట్టినవేనంటూ ఓ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత రోజు అది నిజం కాదంటూ పోలీసులు మరో వీడియో విడుదల చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎదురైంది. వరద సాయాన్ని బండి సంజయ్ ఆపారంటూ వీడియో వైరలైంది. కానీ, భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడం ద్వారా ఆ విమర్శకు చెక్ చెప్పినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ అభ్యర్థులు ఉండి ఉంటే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరేళ్లుగా టీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్ పోటీనిస్తూ వస్తోంది. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీల్లో మార్పు వస్తోంది. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చి చేరుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని విశ్లేషించాయి.
గతంలో వివిధ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల నుంచి స్థానిక సంస్థలు వంటి వాటిల్లో గెలుపొందిన వారు కూడా అధికార పార్టీలో చేరారు. తద్వారా, కాంగ్రె్‌సను గెలిపిస్తే టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిపోతారనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. దీనికి కారణం అధికార పార్టీ వైఖరే.
