నిండు ప్రాణాలు గల్లంతు

ABN , First Publish Date - 2020-10-19T08:25:21+05:30 IST

నిండు ప్రాణాలు గల్లంతు

నిండు ప్రాణాలు గల్లంతు

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఘటనల్లో పలువురి మృతి

వీరిలో నలుగురు చిన్నారులు..  ఇద్దరు వ్యాపారులు

వర్షాల నేపథ్యంలో కొనసాగుతున్న విషాదాంతాలు


బంజారాహిల్స్‌, మంగళ్‌హాట్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం కొనసాగుతోంది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలు.. వనపర్తి జిల్లా కంచిరావుపల్లి తండాకు చెందిన గోపాల్‌, మోనిక ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.5 దుర్గాభవానీనగర్‌లో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు సిద్దు(4) ఆదివారం ఆడుకుంటూ సమీపంలోని భవన నిర్మాణ పునాదుల గుంతలో పడ్డాడు. వర్షాలతో గుంతలోకి నీరు చేరడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఇంటి గోడ కూలి.. మంగళ్‌హాట్‌ ఆర్‌కేపేట్‌లో బాలిక ఆదిబా బేగం(6) మృతి చెందింది. కరీంనగర్‌లో మానేరు నది వద్ద ఉన్న దర్గాకు వచ్చిన కశ్మీర్‌గడ్డకు చెందిన షకీన (35), ఆమె కుమారుడు అహిల్‌ (3) వరద ఉధృతితో నీట మునిగి చనిపోయారు.


వర్షాలకు చేరిన నీటిని తొలగించేందుకు మోటార్‌ ఆన్‌ చేయబోయి హైదరాబాద్‌ ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన మెడికల్‌ షాప్‌ యజమాని జోగు శ్రీనివాస్‌ (40), బాలానగర్‌లో ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వాహకుడు వెంకటనాయుడు (31) విద్యుదాఘాతంతో మృతిచెందారు.


సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఇసుకబావి వాగులో ఐదు రోజుల కిందట కారు సహా కొట్టుకపోయిన మల్లికార్జున్‌ మృతదేహం ఆదివారం లభ్యమైంది. కంది మండలం ఎర్దనూర్‌ వాగులో పోచయ్య (65), చిన్న (14), హైదరాబాద్‌ కిషన్‌బాగ్‌కు చెందిన షేక్‌ అమీర్‌ (18) మూసీ నదిలో కొట్టుకుపోయాడు. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌ ఇంకుడుగుంతో పడి వృద్ధురాలు (70) ప్రాణాలు కోల్పోయింది.  


ప్రయాణం నిలిచింది.. ప్రాణాలు పోయాయి

గత మంగళవారం గగన్‌పహడ్‌ అప్ప చెరువు కట్ట తెగడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆయాన్‌ (7) ఆదివారం సెలబ్రేషన్‌ గార్డెన్‌ గేటు సమీపంలో బండరాళ్ల మధ్య విగతజీవిగా కనిపించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన సాధిక్‌ బార్య కరీమా బేగం, కుమారులు ఆయాన్‌, ఆమీర్‌తో అత్త అఫ్జల్‌ బేగం ఇంటికి వచ్చాడు. 12వ తేదీన తిరుగు ప్రయాణమైనా వర్షంతో ఆగిపోయాడు. ఆ రాత్రి వర్షానికి కరీమా, అయాన్‌, అమీర్‌, సాధిక్‌ బావమరిది ఆమీర్‌ఖాన్‌ కొట్టుకుపోయారు. మిగతావారి మృతదేహాలు తర్వాతి రోజు లభ్యమయ్యాయి.

Updated Date - 2020-10-19T08:25:21+05:30 IST