గాలివాన బీభత్సం!

ABN , First Publish Date - 2020-05-17T08:45:58+05:30 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు నేలకూలగా, మామిడి, వరి, జొన్న పంటలు ధ్వంసమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి...

గాలివాన బీభత్సం!

రాజధాని సహా పలు జిల్లాల్లో కూలిన వృక్షాలు

నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, జొన్న

కూలిన విద్యుత్తు స్తంభాలు.. పిడుగుపడి ఇద్దరు మృతి

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఉత్తర ఒడిశా, బెంగాల్‌ దిశగా పయనం


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు నేలకూలగా, మామిడి, వరి, జొన్న పంటలు ధ్వంసమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. భారీ వర్షానికి హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. శనివారం మద్యాహ్నం 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనేక చోట్ల వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటిని తొలగించారు. మహబూబ్‌నగర్‌లో గాలివానకుతో పలుచోట్ల రేకుల షెడ్లు కూలిపోయాయి. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తడిసి ముద్దయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో రాయిగూడకు చెందిన ఆత్రం మాధవరావు (35), ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో గొర్రెల కాపరి బసవయ్య(45) పిడుగుపాటుకు మృతి చెందారు. ఖమ్మంలో రెండు గేదెలు, వికారాబాద్‌ జిల్లాలో మూడు ఎద్దులు చనిపోయాయి. వికారాబాద్‌ జిల్లా శెట్టిపల్లి, ఆకుతోటపల్లి, ముద్విన్‌, మంగళపల్లి, సంకటోనిపల్లి, ఎక్వాయిపల్లిలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలగా, వరి ధ్వంసమైంది. 


నేడు, రేపు వర్షాలు 

క్యుములోనింబస్‌ మేఘాల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది వేగంగా తీవ్రమై రాగల 12-24 గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 

Updated Date - 2020-05-17T08:45:58+05:30 IST