వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2020-10-14T08:01:47+05:30 IST

ఒకసారి మొదలైన జడివాన ఆగకపోతే? రోజంతా నిర్విరామంగా అంతకంతకూ ఉధృతి పెరుగుతూ ధారాపాతంగా కురుస్తూనే ..

వర్ష బీభత్సం

జాతీయ రహదారులు బంద్‌

రాష్ట్రం అంతటా కుండపోత

హైదరాబాద్‌ పాతబస్తీలో గోడకూలి 

ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి

ఇబ్రహీంపట్నంలో మరో ఘటనలో తల్లీకూతుళ్లు దుర్మరణం

రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో 8 మంది గల్లంతు

రోజంతా వాన హోరు.. రాష్ట్రం గజగజ.. పొంగిపొర్లిన వాగులు, కుంటలు

చెరువులకు గండ్లు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి మోకాలి లోతు వరద 

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలివాన.. పట్టపగలే చీకటి వాతావరణం

రాజధానిలో రోడ్లపై నడుంలోతు నీళ్లు.. గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే జనం

వరంగల్‌, విజయవాడ హైవేలపై మోకాలి లోతు వరద.. నిలిచిన రాకపోకలు

మరో రెండ్రోజులు వర్షాలే.. నేడూ భారీ వర్షం.. 48 గంటల పాటు అప్రమత్తం

జేఎన్టీయూ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా

ఏపీలో జల విలయం.. గోదావరి జిల్లాలు కకావికలం


అధికారులను అప్రమత్తం చేయండి సీఎ్‌సకు సీఎం ఆదేశాలురాష్ట్రంలో కురిస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పరిస్థితులను డీజీపీతో కలిసి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎస్‌ వివరించారు. లోతట్టు ప్రాంతాలు, రిజర్వాయర్లు, విద్యుత్తు స్తంభాలు, రహదారులపై కూలిన చెట్ల వివరాలను సేకరించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.


హైదరాబాద్‌లో రెడ్‌ అలర్ట్‌ 

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరాన్ని రెడ్‌అలెర్ట్‌గా ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ విభాగం హెచ్చరించింది.  నగర వాసులు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని కోరారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పరిస్థితి సాధారణంలోకి వస్తుందన్నారు.ఉదయం నుంచీ ముసురు! సాయంత్రం ఐదు గంటల తర్వాత జోరువాన! ఏడు గంటల తర్వాత నుంచి కుండపోత! అర్ధరాత్రి వరకూ కొనసాగిన వర్ష బీభత్సం! రికార్డు స్థాయిలో అత్యధికంగా ఘట్‌కేసర్‌లో 31.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు! ఊరు ఏరైంది! కాలనీ చెరువైంది! జాతీయ రహదారి సాగరమైంది! వెరసి, తెలంగాణ వ్యాప్తంగా జల విలయం!!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌):ఒకసారి మొదలైన జడివాన ఆగకపోతే? రోజంతా నిర్విరామంగా అంతకంతకూ ఉధృతి పెరుగుతూ ధారాపాతంగా కురుస్తూనే ఉంటే? అచ్చంగా ఇలానే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వరుణుడి బీభత్సం సాగింది. కొన్నాళ్లుగా రాష్ట్రాన్ని వదలని అతివృష్టి మరో దశకు చేరింది. పాత ఇళ్లు కూలాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. వరద ఽఉధృతికి చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. ప్రవాహ ఉధృతికి వేర్వేరు చోట్ల జనం గల్లంతయ్యారు. కొన్నిచోట్ల కూలిపోయిన పాత ఇళ్లు.. నిండు ప్రాణాలను మింగాయి! రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల మంగళవారం రోజంతా విరామం లేకుండా వాన దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వర్షం పడింది. వాగులు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు, కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. పలుచోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రికార్డు స్థాయిలో మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో 31.9సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 29.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి, మధిరలోని విద్యుత్తు సబ్‌స్టేషన్లలోకి వదర నీరు రావడంతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. భారీ వర్షానికి రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5:30 నుంచి అర్ధరాత్రి దాకా జోరుగా వాన పడింది. మధ్యాహ్నం 2:30 నుంచి ఉధృతి మరింత పెరిగింది. వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. భారీ వర్షానికి బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. కొన్నిచోట్ల రోడ్లపై నడుంలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, వరద తీవ్రత మధ్య వాహనదారులకు ఇళ్లకు చేరడం కష్టమైంది.


చాలాచోట్ల కరెంటు సరఫరా బంద్‌ చేయడంతో చీకట్లు కమ్ముకున్నాయి.  రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రోజంతా భారీగా, గురువారం తేలికపాటి వర్షాలుంటాయని పేర్కొంది. తీవ్ర వాయుగుండం మంగళవారం సాయంత్రం 5:30 గంటల తర్వాత తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అక్కడి నుంచి మధ్య మహారాష్ట్ర యరత్వాడ వైపు వెళ్లిపోతోంది. బుధవారం సాయంత్రానికి వాయుగుండం కాస్త బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.


ప్రవాహ ఉధృతికి.. పాపం వారు 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మలిశెట్టిగూడలో ఇంటి గోడ కూలిపోవడంతో ఆ సమయంలో టీవీ చూస్తున్న క్యామ సువర్ణ (38), ఆమె కూతురు స్రవంతి(16) మృతి చెందారు. వనపర్తిలోని నల్లచెరువు వాగును దాటుతూ బుచ్చిరెడ్డి(58), బైడ్ల గోవిందు(55) గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకొండిలో బడికుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సీహెచ్‌ సత్యనారాయణమూర్తి(45) చెరువుకు గండిపడటంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పెనుబల్లి రాతోని చెరువు అలుగు దాటుతుండగా ప్రవాహ ఉధృతికి మల్లెల రవి(35), అతని కుమారుడు జగదీశ్‌ కొట్టుకుపోయారు. భువనగిరి రూరల్‌ మండలం నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడలో 20 గొర్రెలు మృతిచెందాయి. 


దెబ్బతిన్న 496 చెరువులు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు 33,184 చెరువులు పూర్తిగా నిండాయి. 496 చెరువులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు చెరువులు, కుంటలపై నీటి పారుదల శాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 43,412 చెరువులు ఉన్నాయి. ఇందులో 33,184 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి. మరో 4,651 చెరువులు 50 శాతం నిండాయి. పూర్తిగా నిండిన చెరువుల్లో కృష్ణా బేసిన్‌లో 16,057 ఉండగా, గోదావరి బేసిన్‌లో 17,127 ఉన్నాయి. మరోపక్క భారీ వర్షాల కారణంగా 234 చెరువులకు గండ్లు పడగా, 108 చెరువులకు బుంగలు ఏర్పడ్దాయి. మరో 154 చెరువులు దెబ్బతిన్నాయి.


వెంచర్‌ ప్రహరీ కూలి.. తొమ్మిది మంది దుర్మరణం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి ఓ వెంచర్‌ ప్రహరీ కూలి.. ఇళ్లపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మహ్మదీయ హిల్స్‌లో నివాసముండే ఓ పహిల్వాన్‌కు చెందిన వెంచర్‌ ప్రహరీ కూలి.. పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. దాంతో ఇళ్లలో నిద్రిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకుని మరణించారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలతో ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మాజిద్‌, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. 


హైదరాబాద్‌-విజయవాడ రహదారి బంద్‌ 

వరద ఉధృతికి పలు జాతీయ రహదార్లు స్తంభించిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. పలు కార్లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భువనగిరి-చిట్యాల, నార్కట్‌పల్లి-అద్దంకి హైవేల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపైనా వరద పోటెత్తింది. ఈ రహదారిపై గూడూరు-పగిడిపల్లి గ్రామాల మధ్య మోకాలిలోతులో నీళ్లు నిలిచాయి. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద, చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి వద్ద జాతీయ రాహదారిపై మోకాలి లోతు నీళ్లు చేరాయి. 


సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ సిద్ధం: కిషన్‌ రెడ్డి 


వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా వచ్చే 48 గంటలు రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాయం అవసరమైతే సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్‌పీఎ్‌ఫతో పాటు పారామిలిటరీ కూడా సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. హైదరాబాద్‌ లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, అధికారులతో కలిసి తమవంతు సాయం చేయాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాదం ఏర్పడ్డ ప్రాంతాల్లో అధికారులకు సహకరించాలని విజ్ణప్తి చేశారు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు స్థానిక అధికారులకు సాయంగా ఉంటాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2020-10-14T08:01:47+05:30 IST