హైదరాబాద్‌లో ఆరోగ్య సర్వే!

ABN , First Publish Date - 2020-04-15T08:19:45+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై దృష్టి సారించింది.

హైదరాబాద్‌లో ఆరోగ్య సర్వే!

జలుబు, దగ్గు, జ్వరంపై బాధితులకు ఫోన్‌

ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి సమాచార సేకరణ


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై దృష్టి సారించింది. ఈ లక్షణాలతో చికిత్స పొందిన వారి డేటాను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సేకరిస్తోంది. పేరు, వయసు, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. అలాంటి రోగులకు మూడు రోజులుగా ఫోన్‌ చేసి వాకబు చేస్తోంది. వారికి టెలీమెడిసిన్‌, వీడియోకాల్‌ ద్వారా సేవలు అందిస్తోంది. వారికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసుకుంటోంది. ఏయే మందులు వాడుతున్నారు? ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? అనే వివరాలను సేకరిస్తోంది.


నగరంలోని మొత్తం 84 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఎవరికైనా ఆరోగ్యం కుదుటపడకుంటే.. ప్రత్యేక సిబ్బందిని వారి ఇళ్లకు పంపి.. పరీక్షలు చేయిస్తోంది. ఇలా రోజుకు సగటున 70-90 మంది వివరాలు సేకరిస్తోంది. వీరిలో ఎవరికైనా విదేశీ ప్రయాణాలు, నిజాముద్దీన్‌ మర్కజ్‌లతో నేరుగా, కాంటాక్టుల ద్వారా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తోంది. అనుమానాస్పద కేసులుంటే.. ఐసోలేషన్‌కు తరలిస్తోంది.

Updated Date - 2020-04-15T08:19:45+05:30 IST