కొత్త రకం కరోనాకు వేగమెక్కువ..జరభద్రం!

ABN , First Publish Date - 2020-12-25T07:11:30+05:30 IST

‘కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు

కొత్త రకం కరోనాకు వేగమెక్కువ..జరభద్రం!

ప్రజలు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌

వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలి

ఆరోగ్య మంత్రి ఈటల సూచన

పది వేల మందికి ‘వ్యాక్సిన్‌’ శిక్షణ


హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కొత్త స్ట్రెయిన్‌ కలకలం, టీకా రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై గురువారం బీఆర్కే భవన్‌లో ఈటల వైద్య ఆరోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారిని ప్రత్యేక పరిశీలనలో పెట్టామని, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. టీకా పంపిణీకి 10 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.


ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తే... రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్‌ అందుతుందని వివరించారు. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ‘‘వైద్య సిబ్బంది, పోలీస్‌, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బందితో పాటు 50 ఏళ్లు పైబడినవారికి తొలి దశలో టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేయాలి. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు.  


నెలాఖరులోగా 8 మినీ డయాగ్నస్టిక్‌ హబ్‌లు

జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఏర్పాటు చేసిన 8 మినీ డయాగ్నస్టిక్‌ హబ్‌లను ఈ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు   ఈటల వెల్లడించారు. హైదరాబాద్‌లోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, అర్బన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖాన్లకు అనుసంధానం చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖాన్లలో 11 సీటీ స్కాన్‌, 3 ఎంఆర్‌ఐ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


ప్రభుత్వ దవాఖానల్లోని ఆపరేషన్‌ థియేటర్ల ఆధునికీకరణకు రూ.30 కోట్లు అవసరం అవుతాయని అధికారులు మంత్రికి నివేదించారు. నిధులు మంజూరుకు ప్రభుత్వం సిద్థంగా ఉందని, ఆరు నెలల్లో వీటిని సిద్ధం చేయాలని సూచించారు. అల్లోపతిలో నయం కాని కొన్ని జబ్బులు ఆయుష్‌ వైద్య విధానంలో తగ్గే అవకాశం ఉన్నందున.. రెండింటి అనుసంధానానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

Updated Date - 2020-12-25T07:11:30+05:30 IST