హరీశ్‌రావు నీటి దొంగ
ABN , First Publish Date - 2020-05-18T08:48:23+05:30 IST
మంత్రి హరీశ్‌రావు నీళ్ల దొంగ. సాగునీటి మంత్రి హోదాలో మా జలాలను ఎత్తుకుపోయిండు. మాకు నీటి కష్టాలు తెచ్చి పెట్టిండు. మా కష్టాలకు ఆయన ఏం సమాధానం చెబుతాడు

- మా నీళ్లను ఎత్తుకుపోయిండు
- సిద్దిపేటలో సంబురాలు.. సంగారెడ్డికి నీళ్ల కష్టాలా..?
- సింగూరు, మంజీరను నింపరా?
- హరీశ్‌ను నిలదీస్త: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘‘మంత్రి హరీశ్‌రావు నీళ్ల దొంగ. సాగునీటి మంత్రి హోదాలో మా జలాలను ఎత్తుకుపోయిండు. మాకు నీటి కష్టాలు తెచ్చి పెట్టిండు. మా కష్టాలకు ఆయన ఏం సమాధానం చెబుతాడు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీశ్‌రావును ప్రశ్నించారు. కాళేశ్వరం నీటితో సిద్దిపేటలో సంబరాలు చేసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు.. సింగూరు, మంజీర నీటిని తరలించి.. గత మూడేళ్లుగా సంగారెడ్డి ప్రజల గొంతు ఎండబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు జలాశయాలను తక్షణం నీటితో నింపాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావు సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అధికారులకు ఆదేశాలిచ్చి సింగూరు, మంజీర నుంచి 16 టీఎంసీల నీటిని ఖాళీ చేయించారని చెప్పారు. నారాయణ్‌ఖేడ్, జోగిపేట ఎమ్మెల్యేలు అసలు నీళ్ల సమస్య గురించే మాట్లాడరని అన్నారు. హరీశ్‌రావు సంగారెడ్డివాసుల బతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. సిద్దిపేటకు నీళ్లు రావడాన్ని తాను తప్పు పట్టడంలేదని, తమ గొంతు ఎండగట్టడాన్నే తప్పు పడుతున్నానని అన్నారు. ‘‘తక్షణం సింగూరు, మంజీర జలాశయాలు నింపాలి. లేని పక్షంలో ఏ రకమైన కార్యాచరణ చేయాలనేది నిర్ణయిస్తం. హరీశ్ సంగారెడ్డి పర్యటనకు ఎప్పుడు వచ్చినా మూడేళ్ల నుంచి మా ప్రజల గొంతులు ఎండబెడుతూ, నువ్వు సంబరాలు ఎట్లా చేసుకుంటున్నవంటూ మంత్రిని నిలదీస్త’’ అని వ్యాఖ్యానించారు. తమ 2 మునిసిపాలిటీలను దత్తత తీసుకున్నట్లుగా మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో నీళ్లు లేకపోయినా తమ ప్రజలు అమాయకంగా నమ్మి, ఆ రెండు మునిసిపాలిటీలనూ గెలిపించారని పేర్కొన్నారు. అయినా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని హరీశ్‌ను ప్రశ్నించారు. సింగూరు, మంజీర నీళ్లకు శరీరంలోని మైల మొత్తాన్ని కడిగేసే శక్తి ఉందని, గోదావరి నీళ్లకు అంత పవర్ ఉండబోదన్నారు.
సంచలనాలు మరో ఎపిసోడ్‌లో చెబుతా
దాదాపు 15 ఏళ్ల తర్వాత హరీశ్‌కు సన్మానం చేశానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అయితే సన్మానం కంటే ముందు ఏం జరిగింది.. తర్వాత ఏం జరిగిందనేది మరో ఎపిసోడ్‌లో చెబుతానని అన్నారు. హరీశ్ తనతో ఏం మాట్లాడారు.. సీఎం కేసీఆర్‌పై ఏమన్నారు.. వంటివి అప్పుడు చెబుతానన్నారు.