ఆన్‌లైన్‌లో చేనేత విక్రయాలు

ABN , First Publish Date - 2020-05-11T08:40:45+05:30 IST

చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా..

ఆన్‌లైన్‌లో చేనేత విక్రయాలు

  • కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి  కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నేత ఉత్పత్తులు పేరుకుపోయాయని, వాటిని అమ్మడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్‌ మాధ్యమాలకు అనుసంధానం చేయాలన్నారు. తెలంగాణలోనూ పోచంపల్లి, గద్వాల వంటి ప్రముఖ ప్రాంతాలలో తయారయ్యే వస్త్రాలతో పాటు ఇక్కత్‌, నారాయణపేట కాటన్‌, గొల్లభామ వంటి అనేక రకాలైన సుసంపన్న చేనేత కళ ఉన్నదని తెలిపారు. భారతదేశం నుంచి సుమారు 350 మిలియన్‌ డాలర్ల విలువ చేసే చేనేత ఎగుమతులు ప్రతి ఏడాది జరుగుతున్నాయని, వీటిని పెంచేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా దృష్టి సారించాలని కోరుతూ.. కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆయన లేఖ రాశారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే చేనేత, జౌళి, దుస్తుల తయారీ పరిశ్రమలను ఆదుకోవాలని, ఖాదీ గ్రామ పరిశ్రమల కేంద్రం, కాటేజ్‌ ఇండస్ర్టీస్‌ ద్వారా చేనేత వస్ర్తాలను కొనుగోలు చేయాలని కోరారు. 


పెట్టుబడులను ఆహ్వానించాలి

మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్ర్తాల విలువ సుమారు 36 బిలియన్‌ డాలర్లుగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించాలని కేటీఆర్‌ సూచించారు. ఆ దిశగా కేంద్రతో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మనదేశం నుంచి ఎక్కువగా వస్ర్తాలను దిగుమతి చేసుకునే అమెరికా, యూరప్‌ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఇక్కడి పరిశ్రమ పుంజుకుంటుందన్ని చాలామంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. నేత పరిశ్రమలలో పని చేస్తున్న వారికి కనీసం 6 నెలలపాటు 50ు కూలీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను అందించే చర్యలు చేపట్టాలన్నారు.పరిశ్రమలో పనిచేస్తున్న వారందరి పీఎఫ్‌, ఈఎ్‌సఐలను 3 నెలలపాటు కేంద్రమే భరించాలని విన్నవించారు. ‘‘బీ ఇండియన్‌, బై ఇండియన్‌’’ నినాదంతో  కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-11T08:40:45+05:30 IST