చేనేత బీమా పథకాన్ని తేవాలి

ABN , First Publish Date - 2020-08-18T07:00:10+05:30 IST

తెలంగాణలో రైతులకు అందిస్తున్న మాదిరిగానే చేనేత కార్మికుల కోసం చేనేత బీమా/భద్రత

చేనేత బీమా పథకాన్ని తేవాలి

  •  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలి
  • పద్మశాలి సంఘ భవనంలో చేనేత దీక్షలు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతులకు అందిస్తున్న మాదిరిగానే చేనేత కార్మికుల కోసం చేనేత బీమా/భద్రత పథకాన్ని తీసుకువాలని తెలంగాణ పద్మశాలి సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం ఈ మేరకు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబూరావు ఆధ్వర్యంలో సంఘం భవనంలో ఒక రోజు చేనేత దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలకు పలు పార్టీలు, సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఈ దీక్షలకు హాజరయ్యారు. చేనేతల డిమాండ్ల సాధన కోసం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా సాగుతున్న దీక్షలకు మద్దతుగా ఈ దీక్షలు చేపట్టారు. కరోనా కష్టకాలంలో పనిలేక, పూటగడవక, అప్పుల భారంతో పలువురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. చేనేత కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాబూరావు హెచ్చరించారు.


ఇవీ మరిన్ని ప్రధాన డిమాండ్లు

  • చేనేత, మరమగ్గాల కార్పొరేషన్‌లకు వెంటనే ఛైర్మన్లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీని నియమించాలి. కార్పొరేషన్లకు రూ.1,000 కోట్ల వంతున కేటాయించాలి.
  • కరోనా సంక్షోభకాలానికి ప్రతి నెలా రూ.8 వేల వంతున సహాయమందించాలి. 
  • త్రిఫ్ట్‌ ఫండ్‌ స్కీంను యధావిధిగా కొనసాగించాలి. 
  • నిల్వ ఉన్న చేనేత ఉత్పత్తులను టెప్కో ద్వారా కొనుగోలు చేయడంతోపాటు మళ్లీ పని కల్పించాలి. 
  • 50 శాతం సబ్సిడీతో ముడిసరుకును అందించాలి.

Updated Date - 2020-08-18T07:00:10+05:30 IST