ఆ సీలింగ్‌తో సగం పడకలు అసాధ్యమే

ABN , First Publish Date - 2020-08-20T08:46:15+05:30 IST

: కరోనా రోగులకు ప్రభుత్వ సీలింగ్‌ ప్రకారం వైద్యం అందించడం సాధ్యం కాదని ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్ణయించాయి. ఆ సీలింగ్‌ ప్రకారం సగం

ఆ సీలింగ్‌తో సగం పడకలు అసాధ్యమే

  • సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల తర్జనభర్జన
  • సీలింగ్‌ పెంచాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు ప్రభుత్వ సీలింగ్‌ ప్రకారం వైద్యం అందించడం సాధ్యం కాదని ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్ణయించాయి. ఆ సీలింగ్‌ ప్రకారం సగం బెడ్స్‌ లో వైద్య, ఆరోగ్య శాఖ పంపే రోగులకు వైద్యం అందించలేమని చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగుల చికిత్సకు సర్కారు ప్రైస్‌ క్యాపింగ్‌ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. జీవో నెంబరు 248 ప్రకారం ప్యాకేజీ ధరలను అమలు చేయని రెండు ఆస్పత్రుల కొవిడ్‌ చికిత్స అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. మరిన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకోకముందే సర్కారుతో చర్చలు జరిపిన ప్రైవేటు ఆస్పత్రులు సగం పడకల్లో సర్కారు ధరకే వైద్యం చేసేందుకు అంగీకరించాయి. వాటిని అమలు చేయకపోవడంతో ప్రైస్‌ క్యా పింగ్‌ ప్రతిపాదనలను సర్కారు తెరపైకి తీసుకొచ్చింది. కరోనా రోగులకు 14 రోజుల వైద్యానికి గరిష్ఠంగా రూ.4 లక్షలు మాత్రమే వసూలు చేయాలని సర్కారు ప్రతిపాదించింది.


సాధారణ వార్డులో 14 రోజుల పాటు ఉంటే రూ.ఒక లక్ష, ఆక్సిజన్‌పై ఉంటే రూ.2 లక్షలు, వెంటిలేటర్‌పై ఉంటే రూ.3-4 లక్షల ప్రైస్‌ క్యాపింగ్‌ను సర్కారు నిర్ణయించింది. దీనిపై కార్పొరేట్‌ ఆస్పత్రులు 4 రోజుల నుంచి సర్కారు సీలింగ్‌పై మల్లగుల్లాలు పడుతున్నాయి. చివరకు రూ.4 లక్షల సీలింగ్‌ గిట్టుబాటు కాదన్న నిర్ణయానికి వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలను సర్కారు ముందు ఉంచుతామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న వారి వైద్యానికి రోజుకు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు. అలా వారం, పది రోజులుంటే రూ.10-15 లక్షల బిల్లు అవుతుందని, అందులో పావు వంతు ధరకే అంటే నిర్వాహణ కూడా సాధ్యం కాదని కార్పొరేట్‌ ఆస్పత్రులంటున్నాయి. అందుకే తమకు నిర్వహణ పరంగా గిట్టుబాటు అయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వాటినే ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ముందు ఉంచుతామంటున్నాయి. మందులు, రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చేసే టెస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని తమ ప్రతిపాదనలుంటాయని కార్పొరేట్‌ ఆస్పత్రులు చెబుతున్నాయి. 

Read more