గట్టెక్కిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-05T08:51:33+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పరీక్షలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టెక్కారు. టీఆర్‌ఎస్ తరఫున

- టీఆర్‌ఎస్‌కు తగ్గిన మెజారిటీ
- అయినా అతిపెద్ద పార్టీగా ఆవిర్భావం
- వర్కింగ్ ప్రెసిడెంట్‌కు మిశ్రమ ఫలితం
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పరీక్షలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టెక్కారు. టీఆర్‌ఎస్ తరఫున జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ఆయనకు ఈసారి మిశ్రమ ఫలితం దక్కింది. సీట్లు తగ్గినా టీఆర్‌ఎ్‌సను అతిపెద్ద పార్టీగా నిలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్.. పార్టీ సారథిగా వ్యవహరించడం ఇది రెండోసారి.
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన 2016 గ్రేటర్ ఎన్నికల్లో తొలిసారిగా పార్టీ కేడర్‌కు సారథ్యం వహించారు. తాజా ఎన్నికల్లోనూ గులాబీ దళానికి కేటీఆర్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాలికి బలపం కట్టుకొని తిరిగారు. కానీ ఫలితం మాత్రం టీఆర్‌ఎస్ నాయకత్వం ఆశించినట్లుగా రాలేదు.
మెజారిటీ సీట్లు దక్కకపోవడమేకాక, 40 పైచిలుకు సిటింగ్ స్థానాలను పార్టీ కోల్పోయింది. దీంతో కవిత, హరీశ్‌రావు కంటే కేటీఆర్ మెరుగైన పనితీరును ప్రదర్శించినప్పటికీ, పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొడితే, చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే, ఆయన స్థానంలో కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారముంది. అయితే ఆశించినట్లుగా టీఆర్‌ఎస్‌కు సీట్లు రాలేదు.