‘గులాబీ’ల్లో గుబులు!
ABN , First Publish Date - 2020-12-19T06:47:53+05:30 IST
‘గులాబీ’ తోటలో గుబులు సెగ రగులుతోందా? దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, ‘గ్రేటర్’ ఎన్నికల్లో తగ్గిన ఆధిక్యంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి మారుతోందా? అంటే..

దుబ్బాక, ‘గ్రేటర్’ ఫలితాలతో మొదలైన ఆందోళన
లబ్ధిదారులు ఓట్లు వేయకపోవడంపై ఆక్రోశం
నియోజకవర్గంలో పనులు కావడం లేదనే అసంతృప్తి
పార్టీ అధిష్ఠానం తీరుపైనా నారాజ్
బీజేపీ నుంచి ఆఫర్‌పై సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హైరానా
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వైఖరిలో అనూహ్య మార్పు
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘గులాబీ’ తోటలో గుబులు సెగ రగులుతోందా? దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, ‘గ్రేటర్’ ఎన్నికల్లో తగ్గిన ఆధిక్యంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి మారుతోందా? అంటే.. ఆ పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మార్పు దిశగా సాగుతుండడం చాలా మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం వారు ఇప్పటినుంచే హైరానా పడుతున్నారు. సొంత నియోజకవర్గాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం తప్పనిసరిగా భావిస్తున్నారు. తమ భవిష్యత్తుకు అవరోధం అనుకున్న అంశాలను అధిగమించటంపై దృష్టి పెడుతున్నారు. రాజకీయ భద్రతకు ఢోకాలేని వైపు చూపులు సారిస్తున్నారు. ఈ అంతర్గత వ్యవహారం ఇప్పుడు అధికార టీఆర్‌ఎ్‌సలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఏడాది నవంబరులో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే డిసెంబరులో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యం 99 డివిజన్ల నుంచి 56 డివిజన్లకు పడిపోయింది. మరోవైపు దుబ్బాక స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీలో నాలుగు డివిజన్ల నుంచి 48 డివిజన్లకు ఎగబాకింది. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పలువురు ఆలోచనలో పడ్డారు.
సగం కూడా రాని ఓట్లు..
దుబ్బాక నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 1.3 లక్షలకు పైగా ఉంది. అయినా.. అక్కడ లబ్ధిదారుల సంఖ్యలో సగం ఓట్లను కూడా టీఆర్‌ఎస్ పొందలేకపోయింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రోడ్లు, ఇతరత్రా పనులు చాలా చేసిందనే అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. కానీ, ఎన్నికల్లో 43 సిటింగ్ డివిజన్లను అధికార పార్టీ కోల్పోయింది. దీంతో తమ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా.. అనే ఆందోళన చాలామంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ పార్టీకి ఓటు వేయడంలేదని దుబ్బాకలో తేలిపోవడంతో ఎమ్మెల్యేల్లో ఆక్రోషం కట్టలు తెంచుకుంటోంది.
‘అడిగిన వారికే కాకుండా.. అడగని వారికి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం కలిగిస్తున్నప్పటికీ పార్టీకి ఓట్లు వేయకపోవడం దారుణం’’ అని వారు అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలును కొంతకాలం నిలిపివేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం విలువ ప్రజలకు తెలిసివస్తుందని అంటున్నారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించి పనులు కావడంలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రధాన సమస్యలను ఇంకా పరిష్కరించకుండా ఉంటే, పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇందుకు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వ్యాఖ్యలే ఉదాహరణ అని అంటున్నారు.
మేం కేసీఆర్ వెంటే..
కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అంతర్గత సంభాషణల్లో సీఎం కేసీఆర్‌కు, అధిష్ఠానానికి పూర్తి విధేయత ప్రకటిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు పొందిన వారిలోనే కొందరు.. పరిస్థితులు కొంత తారుమారు కాగానే బీజేపీ వైపు చూస్తున్నారని, ఎవరు, ఎక్కడికి వెళ్లినా.. తాము మాత్రం సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని తమ సన్నిహితులకు చెబుతున్నారు.
భవిష్యత్తు ఎలా ఉన్నా.. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా టీఆర్‌ఎ్‌సకు రక్షణ కవచంగా నిలుస్తామని అంటున్నారు. పార్టీలోని ఈ భిన్నస్వరాల సమాచారం ఇప్పటికే అధిష్ఠానం ముఖ్యులకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తు పరిణామాలపై టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే కాంట్రాక్టర్లకు పనులు
మరికొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానం తీరుపై తమ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పనులు కాకపోవడం ఒకటైతే.. అధిష్ఠానం ముఖ్యులను వారు పిలిస్తే తప్ప కలిసే పరిస్థితి లేకపోవటంపై రగిలిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఎక్కువ మొత్తం నిధులతో పూర్తయ్యే పనులను తమ ప్రమేయం లేకుండానే, హైదరాబాద్ నుంచి వచ్చే సిఫారసులతో కాంట్రాక్టర్లు గద్దల్లా తన్నుకుపోతున్నారని మరికొందరు వాపోతున్నారు. ఏదైనా పని కోసం వెళితే.. ఆ పని ఎలా, ఎవరి ద్వారా వచ్చింది? మీకు వాళ్లు ఎలా తెలుసు? అంటూ ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా ? లేదా? అనే బెంగ పట్టుకుంది. వారిలో కొందరు బీజేపీ నుంచి మంచి ఆఫర్ ఉందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. తమతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలకూ ఈ ఆఫర్ ఉందని చెబుతున్నారు. వరుసగా పదేళ్లు టీఆర్‌ఎ్‌సకు అవకాశం ఇచ్చిన ప్రజలు.. వచ్చేసారి తప్పక మార్పు కోరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
