గ్రూప్‌ - 4 ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-10-07T07:41:27+05:30 IST

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,554 మందిని టీఎ్‌సపీఎస్సీ ఎంపిక చేసింది.

గ్రూప్‌ - 4  ఫలితాలు విడుదల

1,554 మంది ఎంపిక 

డిసెంబరు15లోగా పెండింగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,554 మందిని టీఎ్‌సపీఎస్సీ ఎంపిక చేసింది. మంగళవారం ఈ మేరకు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, కమిషన్‌ సభ్యులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు.  జూనియర్‌ అసిస్టెంట్‌గా 1090 మంది, టైపి్‌స్టగా 425, స్టెనో(ఇంగ్లి్‌ష)గా 39 మంది అభ్యర్థులు  ఎంపికయ్యారు. అర్హులైనవారు లేకపోవడంతో 44 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది.


ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామనిపేర్కొంది. గ్రూప్‌-4 ఉద్యోగం సాధించినవారిలో 95 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉండటం గమనార్హం.  1,554 మందిలో దాదాపు 740 మంది మహిళలున్నారు. 11 ప్రభుత్వ శాఖల్లోని 1,595 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి 2018 జూన్‌లో నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,35,389 మంది దరఖాస్తు చేసుకున్నారు.  రాత పరీక్ష అనంతరం 2.25 లక్షల మంది అభ్యర్థులతో టీఎ్‌సపీఎస్సీ మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. అందులో మెరిట్‌ ఆధారంగా దాదాపు 40 వేలకు పైగా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించింది. 48 రోస్టర్‌ కేటగిరీలు, 179 వెబ్‌ ఆప్షన్‌లు ఉండటం వల్ల  ఫలితాల ప్రకటనలో కొంత జాప్యం జరిగిందని కమిషన్‌ పేర్కొంది.


30,723 పోస్టుల భర్తీ: చక్రపాణి

టీఎ్‌సపీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 30,723 పోస్టులను భర్తీ చేసినట్లు చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. మొత్తం 39,952 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, అందులో 36,665 పోస్టులు నోటిఫై అయ్యాయని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి 107 నోటిఫికేషన్లను జారీ చేశామని వివరించారు.  దాదాపు 5వేలకు పైగా పోస్టులు కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని,  డిసెంబరు 15లోగా వాటిని భర్తీ చేస్తామని వివరించారు.


500 హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌, పండిట్‌ పోస్టులను దసరా పండుగ నాటికి భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 26 నోటిఫికేషన్లు మెరిట్‌ జాబితా ప్రకటన, ధ్రువపత్రాల పరిశీలన దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు  మొత్తం 50 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గత ఐదేళ్లలో టీఎ్‌సపీఎస్సీ పైన దాదాపు 1000కి పైగా కేసులు వేశారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ మూడు నోటిఫికేషన్లను జారీ చేశామన్నారు. కొవిడ్‌ పరిస్థితులను సైతం అధిగమించి నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న కమిషన్‌ ఉద్యోగులకు ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2020-10-07T07:41:27+05:30 IST