ఇరిగేషన్‌ పనులకు పచ్చజెండా

ABN , First Publish Date - 2020-04-28T08:54:53+05:30 IST

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు పనులను పాక్షికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున.. ఇప్పటికే

ఇరిగేషన్‌ పనులకు పచ్చజెండా

పాక్షిక నిర్వహణకు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం

క్యాంపుల్లోని కార్మికులతోనే మట్టిపనులు

వలసకూలీలకూ ‘ఉపాధి’ పనులు!

ఇటుకబట్టీ, స్టోన్‌క్రషర్‌ పనులు ప్రారంభం

ప్రభుత్వానికి కూలీల కృతజ్ఞతలు

ఇరిగేషన్‌ పనులకు పచ్చజెండా


హైదరాబాద్‌, రంగారెడ్డి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు పనులను పాక్షికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున.. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి క్యాంపుల్లోనే ఉంటున్న కార్మికులతో మట్టిపనులను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్లు నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయి, నీటిని కూడా లిఫ్ట్‌ చేస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లోనూ ఇంకా చాలా పనుల్ని చేయాల్సి ఉంది. సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల పనులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ భారీ స్థాయిలో ఉండడంతో వాటికి అవసరమైన పనివారిని కూడా అక్కడే ఉంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహర్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి ఈ కార్మికులు ఎక్కువగా వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా ఎక్కడికీ వెళ్లలేక తమకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే ఉంటున్నారు. వారికి అవసరైన ఆహరం, ఇతర వస్తువులను కాంట్రాక్టర్లే అందిస్తున్నారు.


కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే.. లాక్‌డౌన్‌ ఎత్తివేతకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సైట్‌లోని పనుల్ని ప్రారంభించారు. ఇసుకతోపాటు.. స్టీల్‌, సిమెంట్‌ నిల్వ ఉన్న ప్రాజెక్టుల్లో నిర్మాణ పనుల్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అవి లేని ప్రాజెక్టుల్లో.. కార్మికులతో మట్టి పని చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాళేశ్వరంలోని మల్లన్నసాగర్‌, గందమల, బస్వాపూర్‌ వంటి రిజర్వాయర్లలో ఎక్కువగా మట్టి పనులే ఉన్నాయి. కార్మికులు ఆ పనులే ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో అనంతగిరి, మలక్‌పేట రిజర్వాయర్‌లకు సంబంఽధించిన కాలువ, కట్ట పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు సీతారామా, పాలమూరు వంటి ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా సాధ్యమైనంత వరకూ వేగంగా పూర్తి చేసి, ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అలాగే.. ప్రస్తుత కష్టకాలంలో స్థానిక కూలీలతో పాటు వలస కూలీలకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రంగారెడ్డి జిల్లాలో వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఇటుక బట్టీలు, స్టోన్‌ క్రషర్‌ పనుల్ని ప్రారంభించారు.


  పలు జిల్లాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేశారు. ఇక.. హైదరాబాద్‌ నగర శివార్లలో కూడా ఇటుకబట్టీలు, స్టోన్‌ క్రషర్లలో పనులకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో వలస కూలీలు ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించి ఈమేరకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇటుకబట్టీల్లో పనులు ప్రారంభమయ్యాయి. మంచాల, రాచలూరు, కందుకూరు గ్రామాల్లో స్టోన్‌ క్రషర్‌ పనులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలో తమకు ఉపాధి కల్పించే నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-04-28T08:54:53+05:30 IST