ఊర్లో గ్రేటర్ ఓటరు
ABN , First Publish Date - 2020-12-01T07:46:38+05:30 IST
ఏ ఎన్నికలొచ్చినా హైదరాబాద్‌లో జనం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తిచూపరు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఇళ్లలోంచి కదలరు. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎప్పుడూ 50ు లోపే పోలింగ్ నమోదవుతూ ఉం టుంది. ప్రస్తుత బల్దియా ఎన్నికల్లో పోలింగ్ పరంగా ఇదే ధోరణి కనిపించే

కరోనా ప్రభావంతో ఉపాధి కరువై సొంతూళ్లకు
స్కూళ్ల బంద్‌తో కొందరు.. స్వరాష్ట్రాలకు ఇంకొందరు
జీహెచ్‌ఎంసీలో ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం
ఈసారి పోలింగ్ రోజు సహా 3 రోజుల సెలవులు
పుణ్యక్షేత్రాలు, ఇతర ప్రాంతాలకు కొందరు ప్లాన్
ఇంకా హైదరాబాద్‌కు చేరని ఐటీ ఓటర్లు
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏ ఎన్నికలొచ్చినా హైదరాబాద్‌లో జనం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తిచూపరు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఇళ్లలోంచి కదలరు. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎప్పుడూ 50ు లోపే పోలింగ్ నమోదవుతూ ఉం టుంది. ప్రస్తుత బల్దియా ఎన్నికల్లో పోలింగ్ పరంగా ఇదే ధోరణి కనిపించే అవకాశాలున్నాయా? కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటింగ్ శాతం మునుపెన్నడూ లేనంతగా తక్కువ స్థాయిలో నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదా? అంటే నిపుణులు ఔను అనే అంటున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎలా ఉండబోతోంది? అన్న చర్చ ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో జోరుగా సాగుతోంది. కరోనా పరిస్థితులతో చాలామంది హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు. వైరస్ ప్రభావంతో పలు సంస్థలు, కంపెనీలు మూతపడటం, నిర్మాణాలు నిలిచిపోవడం తదితర కారణాలతో ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఎంతో మంది హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లిపోయారు.
విద్యాసంస్థలు తెరవకపోవడంతో పిల్లల చదువుల కోసమే పట్నంలో ఉంటున్నవారు కూడా స్వస్థలాలకు వెళ్లిపోయారు. కొన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయిస్తుండటంతో ప్రస్తుతం వారూ ఊర్లలోనే ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం ఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చిన వారిలో చాలామంది లాక్‌డౌన్ ప్రభావంతో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈ తరహా జనం అంతా ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారు. ఇక హైదరాబాద్‌లో నివాసముండే వారిలో 70ు అద్దెకు ఉండేవారే. వివిధ కారణాలతో వీరిలో చాలామంది ఇళ్లు మారుతూ ఉంటారు. వీరూ బూత్‌లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్‌కు 2002లో జరిగిన ఎన్నికల్లో 41.22ు పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌గా మారిన తర్వాత 2009లో 42.95ు పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు 2016లో జరిగిన ఎన్నికల్లో 45.27ు మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలే కాదు.. చట్టసభలకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకర్గాల్లో 50 శాతానికి లోబడి పోలింగ్ నమోదవుతోంది.
వరుసగా మూడు రోజులు సెలవులు
పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నా కూడా చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. పైగా దానికి ముడిపడి వరుస సెలవులొస్తే దాన్ని చాలామంది ఓ అవకాశంగా తీసుకొని కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక స్థలాలకో.. ఇతర పర్యాటక ప్రాంతాలకో.. సొంతూళ్లకో వెళుతున్నారు. చిత్రం ఏమింటే.. ఈసారి జీహెచ్‌ఎంసీ పోలింగ్ రోజుకు ముడిపడి అదనంగా రెండు సెలవులొచ్చాయి. పోలింగ్ రోజైన డిసెంబరు 1న (మంగళవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతకుముందు నవంబరు 29 ఆదివారం కావడం, ఆ మరుసటి రోజు సోమవారం కార్తీక పౌర్ణమి రూపంలో సెలవులున్నాయి. అంటే ఆది, సోమ, మంగళవారాల్లో సెలవులు కావడంతో చాలామంది కుటుంబంతో కలిసి ఏదైనా టూర్‌కు ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు.
ఇంకా నగరానికి చేరని ఐటీ ఉద్యోగులు
లాక్‌డౌన్ వల్ల దాదాపు అన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. దాంతో చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ కారణంగా గ్రేటర్‌లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో ఓటింగ్‌పై ప్రభావం పడనుంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ ప్రాంతంలో 52వేల ఓటర్లుండగా.. వారిలో దాదాపు 10వేల మంది ఇంకా నగరానికి చేరలేదు. పిల్లలకు కూడా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండడం వారు నగరానికి రాకపోవడానికి మరో కారణం. ఇక.. ఐటీ, దాని అనుబంధ రంగాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తూ కార్యాలయాలకు వెళుతున్న వారు కూడా వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రావడంతో.. వారు కూడా స్వస్థలాల దారి పట్టారు.