పట్నం ఎన్నికల పోరు.. కరోనానూ చూడరూ!

ABN , First Publish Date - 2020-11-21T08:33:21+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల హడావుడిలో.. కరోనా నిరోధక జాగ్రత్తలు పట్టడం లేదు. తెలంగాణలోని మొత్తం 2.61 లక్షల కేసుల్లో సగం పైగా నమోదైన హైదరాబాద్‌లో మరింత అప్రమత్తంగా

పట్నం ఎన్నికల పోరు.. కరోనానూ చూడరూ!

 ప్రచారానికి పొరుగు నుంచి శ్రేణులు

 ప్రచార ఆర్భాటంలో జాగ్రత్తలు విస్మరణ

 కేసులు పెరిగే ముప్పుందంటున్న డాక్టర్లు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల హడావుడిలో.. కరోనా నిరోధక జాగ్రత్తలు పట్టడం లేదు. తెలంగాణలోని మొత్తం 2.61 లక్షల కేసుల్లో సగం పైగా నమోదైన హైదరాబాద్‌లో మరింత అప్రమత్తంగా ఉండాల్సినప్పటికీ అదేమీ కనిపించడం లేదు. నామినేషన్ల చివరి రోజు అభర్థులు నిర్వహించిన ర్యాలీలో ఎక్కడా కొవిడ్‌-19 నిబంధనలు కనిపించలేదు. మూడు, నాలుగు సర్కిళ్ల కార్యాలయాలు ఒకేచోట ఉన్నదగ్గర నాయకులు, కార్యకర్తలు కిక్కిరిశారు. వీరిలో చాలామంది జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక ప్రచారంలో భాగంగా ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక నేతల్లో ఎక్కువమంది మాస్క్‌లు ధరించడం లేదు. కొందరు విద్యావంతులు దీనిని గమనించి నాయకులను ప్రశ్నిస్తున్నారు కూడా.


అంబర్‌పేటలోని ఓ డివిజన్‌లో గురువారం జాగ్రత్తలు తీసుకోకుండా అనుచరులతో ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికి వెళ్లిన అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. ‘మాస్క్‌లు లేకుండా వచ్చి ఎంతమందికి అంటిస్తారు? బాధ్యతాయుత పదవికి పోటీ చేస్తున్న మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం?’ అంటూ ఉద్యోగిని నిలదీశారు. ఆమెతో ఏకీభవించిన అభ్యర్థి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. మరోవైపు లక్షణాలున్నా మాదాపూర్‌కు చెందిన ప్రధాన పార్టీ కార్యకర్త ఒకరు తమ నాయకుడి వెంట వారం రోజులు తిరిగారు. తీరా బుధవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.


ఆయనతో కలిసి తిరిగిన  నాయకులంతా ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు కీలక ఎన్నికలు కావడంతో వివిధ జిల్లాల నుంచి పార్టీల నాయకులు, కీలక కార్యకర్తలు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. ‘దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు ప్రచారంలో పాల్గొనకపోవడం ఉత్తమం. ప్రాథమిక జాగ్రత్తలు పాటించకుంటే డిసెంబర్‌లో నగరంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఓటర్లు కూడా తమ వద్దకు వచ్చే అభ్యర్థులు, కార్యకర్తలతో దూరంగా ఉండి మాట్లాడాలి’ అని కేర్‌ ఆస్పత్రి వైద్యుడు చైతన్య సూచిస్తున్నారు.

Updated Date - 2020-11-21T08:33:21+05:30 IST