గ్రేటర్‌లో పోలింగ్ ప్రారంభమైనప్పట్నుంచి గొడవలు ఇలా...

ABN , First Publish Date - 2020-12-01T16:00:17+05:30 IST

గ్రేటర్‌లో పోలింగ్ ప్రారంభమైనప్పట్నుంచి గొడవలు ఇలా...

గ్రేటర్‌లో పోలింగ్ ప్రారంభమైనప్పట్నుంచి గొడవలు ఇలా...

హైదరాబాద్‌ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకే ప్రారంభమైంది. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో  ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిని చెదరగొట్టి ప్రశాంతంగా పోలింగ్ జరిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ ఏయే ప్రాంతాల్లో.. ఏయే పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య గొడవలు జరిగాయో ఓ లుక్కేద్దాం.


- పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య స్కూల్‌ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తమ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్త విష్ణు దాడి చేశాడని బీజేపీ అభ్యర్థి ఆశీష్‌గౌడ్‌ ఆరోపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.


- భారతీనగర్‌ డివిజన్‌ ఎల్‌ఐజీ కాలనీ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఫొటోతో కూడిన స్లిప్‌ల పంపిణీ

 చేస్తుండటంతో బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అభ్యంతరం తెలిపారు. అధికారులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంజిరెడ్డి ఆరోపిస్తున్నారు. 


- ఓల్డ్‌మలక్‌పేట్  డివిజన్‌లో సీపీఐ అభ్యర్ధి  గర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. సీపీఐ గుర్తు  కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి నక్షత్రం ఎన్నికల అధికారులు ముద్రించారు. ఈ ఘోర తప్పిదాన్ని సీపీఐ నాయకులు తూర్పరపడుతున్నారు. డివిజన్ ఎన్నికలు రద్దుచేసి మరోసారి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  ఇదంతా ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఓల్డ్ మలక్‌పేట్ సీపీఐ అభ్యర్థి ఫాతిమా ఇంటికి పోయి బెదిరింపులకు పాల్పడిన మహమ్మద్ బలాలపై క్రిమినల్ కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.


- మన్సూరాబాద్ డివిజన్(12) సహారా ఎస్టేట్‌లో పరిగి నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు  ఓటర్లను ప్రలోభాలకు పెట్టుతున్నారని బీజేపీ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. 


- పఠాన్‌చేరు 113 డివిజన్ చైతన్య నగర్‌లో  బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.  స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి.. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడ్నుంచి పంపించేశారు.  తమ కార్యకర్తలపై దాడి చేసినందుకు మేము ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు పైన ఫిర్యాదు చేశామని.. ఇలాంటి దాడులను ఖండిస్తున్నామని బీజేపీ అభ్యర్థి ఆశిష్ గౌడ్  మీడియాకు వెల్లడించారు. 


- యాకుత్‌పురాలో ఆటోల్లో వచ్చి దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు వచ్చారు. సమాచారం అందుకున్న ఎంబీటీ నాయకులు  పోలీసులకు అప్పగించారు.


- సంగారెడ్డి జిల్లాలోని 111 భారతి నగర్ డివిజన్  ఎల్ఐజి  కాలనీలోని సొసైటీ ఆఫీస్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.  టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ఫోటోతో కూడిన పోలింగ్ స్లిప్ ల పంపిణీపై  బీజేపీ అభ్యర్థి గోదావరి అంజి రెడ్డి  అభ్యంతరం తెలిపారు.  పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


-సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట డివిజన్‌లో ఓటర్ స్లిప్‌లు అధికారులు పంపిణీ చేయకపోవడంతో ఓటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.  బూత్ అడ్రస్ దొరక్క ఓటు హక్కు వినియోగించుకోకుండానే జనాలు ఇంటి బాట పడుతున్నారు.  మై జీహెచ్ఎంసీ యాప్‌ను వినియోగించుకుని ఓట్లు వేయడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.


- బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు కాషాయ మాస్కులతో వచ్చారు. అయితే వాళ్లకు దీటుగా టీఆర్ఎస్ కార్యకర్తలు,  బూత్ ఏజెంట్లు గులాబీ రంగులో ఉన్న క్లాత్‌ను చేతులకు కట్టుకున్నారు. దీంతో గొడవలు జరిగే పరిస్థితులు నెలకొనవచ్చని ముందస్తుగా పోలీసులు ఈ డివిజన్‌లో పెద్ద ఎత్తున మోహరించారు. 


- నగరంలోని ఘన్సీబజార్ అభ్యర్థి రేణుసోని ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులు లేకపోతే ఓటు వేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.


- గద్వాల విజయలక్ష్మి అనుచరులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాస్కులతో లోపలికి వెళ్ళొద్దు అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు బూత్ ముందు గొడవకు దిగారు. 


- ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కాషాయం రంగు  మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గీయులు... చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు వాగ్వాదానికి ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు.  బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి గులాబీ కండువాలతో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49, వద్ద ఉద్రిక్తత నెలకొంది.


- తార్నాక డివిజన్ బూత్ నెంబర్ 36, 37 లో ఏజెంట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రోచర్లను టేబుల్‌పై పెట్టుకొని ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గీయుల మధ్య గొడవ చోటుచేసుకుంది. 


- భారతీనగర్ డివిజన్‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని స్థానికుల ఆవేదన చెందుతున్నారు. ఓట్లే కాదు యాబై ఏళ్లుగా ప్రభుత్వం స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నా పట్టాలివ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఐదేళ్లుగా చెప్పి మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


- మాదాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా బీజుపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరోవైపు.. మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2020-12-01T16:00:17+05:30 IST