టీఆర్ఎస్ పార్టీని ‘ఆ నలుగురు’ నియంత్రించగలరా?

ABN , First Publish Date - 2020-10-03T16:43:41+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ స్లోగన్ అందుకోబోతోంది? బల్దియాలో ఎన్ని స్థానాలపై గురి పెట్టింది? హైదరాబాద్ నగర బీజేపీకి నలుగురు అధ్యక్షులను నియమించటానికి

టీఆర్ఎస్ పార్టీని ‘ఆ నలుగురు’ నియంత్రించగలరా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ స్లోగన్ అందుకోబోతోంది? బల్దియాలో ఎన్ని స్థానాలపై గురి పెట్టింది? హైదరాబాద్ నగర బీజేపీకి నలుగురు అధ్యక్షులను నియమించటానికి కారణమేంటి? గ్రేటర్ పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీని "ఆ నలుగురు" నియంత్రించగలరా? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం...


గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు చాప‌కింద నీరులా తమ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో రెండు పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మరోవైపు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న కమలం పార్టీ సైతం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తాను నిరూపించుకోవాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్‌ ప్రిపేర్ కూడా చేసుకుంటోంది. గ్రేటర్‌లో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై కమలం పార్టీ నాయకులు పోరాటం చేయనున్నారు. సమస్యలను గుర్తించే పనిలో మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు లాంటి సీనియర్ నాయకులు నిమగ్నమయ్యారట. ఈ క్రమంలో త్వరలో ప్రజా సమస్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు జీహెచ్ఎంసీ పరిధిలో "బస్తీ బాట" పడతారని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఆ రెండు పార్టీలపై దూకుడు పెంచాలని...

ఇక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలంటే.. అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై దూకుడుగా వ్యవహరించాలని కమలనాథులు భావిస్తున్నారట. "టీఆర్ఎస్-ఎంఐఎం ముక్త్ హైదరాబాద్" నినాదంతో జీహెచ్ఎంసీ పోరులో తలపడాలని కమలం పార్టీ నేతలు నిర్ణయించారని సమాచారం. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలను ఓడించి హైదరాబాద్‌ను రక్షించుకుందామని ఓటర్లకు పిలుపునివ్వాలని కమలం పార్టీ వ్యూహరచన చేసినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్‌ కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్‌లు ఉన్నాయి. వీటిల్లో 40 డివిజన్లలో తాము బలంగా ఉన్నామని కమలనాథులు అంటున్నారు. టీఆర్ఎస్‌కు దీటుగా ఎన్నికల ప్రణాళికను రచిస్తే.. 30కిపైగా స్థానాలను సులభంగా గెలుచుకోవచ్చని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బలమైన అభ్యర్థులను గుర్తించే పనిని సీనియర్ నాయకుల బృందం ఇప్పటికే ప్రారంభించింది. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే పని చేసుకునే వీలుంటుందన్న  యోచనలో కమలం పార్టీ నేతలు ఉన్నారట.


కొత్త పంథా కలిసొస్తుందా...?

మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈవీఎంలతోనే గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలని ఈసీని కలసి కోరాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. దేశంలోని ప్రతి ఎన్నికను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం పాలసీగా ఉంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు అధ్యక్షులను నియమించి బీజేపీ కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. బల్దియా ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్ జిల్లాను నాలుగు విభాగాలుగా విభజించి అధ్యక్షులను నియమించింది. గోల్కొండ యూనిట్‌కు పాండు యాదవ్, బర్కత్‌పురాకు పార్టీ అధ్యక్షుడిగా గౌతమ్‌రావు, మహంకాళీకి బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్, భాగ్యనగర్‌కు సామారెడ్డి సురేందర్‌రెడ్డిలను అధ్యక్షులుగా నియమించింది. ఈ కొత్త పంథా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి కలిసొస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. ముంబయి, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కూడా నలుగురు అధ్యక్షుల ఫార్ములా విజయవంతమైందని వారంటున్నారు.


మొత్తంమీద, అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీకి.. గ్రేటర్ ఎన్నికల్లో నలుగురు కొత్త అధ్యక్షుల పనితీరు ఎంతవరకు లాభిస్తుందనే చర్చ కమలనాథుల్లో జరుగుతోంది. మరి వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Updated Date - 2020-10-03T16:43:41+05:30 IST