కర్ణాటక ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు
ABN , First Publish Date - 2020-11-21T09:24:00+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కర్ణాటక నుంచి వడ్ల లారీలు వస్తున్నాయి. సరిహద్దు ఆవల రైతుల నుంచి

క్వింటాకు1500లోపు కొని.. 1888రూపాయలకు విక్రయం
మక్తల్ కేంద్రంగా దళారుల దందా.. రాయచూర్ ప్రాంతంలో కొనుగోలు
ఇక్కడి రైతుల పేరుతో ధ్రువీకరణ పత్రాలు..
అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలు
దొడ్డిదారిన రోజుకు నాలుగైదు లారీల లోడ్..
క్వింటాకు రూ.300 నుంచి రూ.400 లాభం
మహబూబ్‌నగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కర్ణాటక నుంచి వడ్ల లారీలు వస్తున్నాయి. సరిహద్దు ఆవల రైతుల నుంచి అగ్వకు కొంటున్న దళారులు, సరుకును దొడ్డిదారిన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఆ ధాన్యాన్ని ఇక్కడి రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు దర్జాగా అమ్ముకొని క్వింటాకు రూ.300-400 దాకా సొమ్ము చేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంగా ఈ దందా ఇటీవల జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాలైన కృష్ణ, మాగనూరు, మక్తల్, ఉట్కూరు మండలాల్లో పుంజుకుంది. ఈ వానాకాలం సీజన్‌లో గ్రేడ్ వన్ ధాన్యానికి క్వింటాకు రూ.1888 చొప్పున, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1868 చొప్పున మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోంది. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని వ్యాపారులకు నిర్దేశించి చేతులు దులుపుకొంది. అయితే అక్కడి వ్యాపారులు మాత్రం క్వింటాకు రూ.1500లోపే కొంటున్నారు. దీన్ని సరిహద్దు ప్రాంతంలోని దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా భీమా నది పరీవాహక ప్రాంతాలైన కాడ్లూరు, కరేకల్, జ్వాలాదడిగి, సూగూరు, కొంగంటితో పాటు యాద్గిర్ జిల్లాలోని గ్రామాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకునంతా ఇక్కడి రాజకీయ నేతల అండదండలతో సరిహద్దు ఈవలకు తరలిస్తున్నారు.
ఇక్కడి రైతుల పేరుతో టోకెన్లు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలంటే రైతులకు ధ్రువీకరణ పత్రాలు, టోకెన్లు తప్పనిసరి. దీంతో స్థానిక రైతుల పేరుతో అవన్నీ సమకూర్చుకొని అక్రమంగా రాష్ట్రంలోకి తరలించిన ధాన్యాన్ని దర్జాగా కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో ధాన్యం లారీలు, సరిహద్దును దాటి లోపలికి వస్తున్నాయి. కర్ణాటక వైపు నుంచి రోజుకు నాలుగైదు లారీల ధాన్యాన్ని రాష్ట్రంలోకి దళారుల ముఠా తరలిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, వారి ఒత్తిళ్లతో అధికారులను ప్రభావితం చేసి అక్రమ ధాన్యం తరలింపు ప్రక్రియను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
ధ్రువీకరణ పత్రాల జారీని కట్టుదిట్టం చేస్తేనే
దళారుల దందాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. స్థానిక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీపై నిఘా పెంచాలని, ఏఈవోలు, ఏవోలు రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. క్లస్టర్ల వారీగా సాగైన వరి, వచ్చిన దిగుబడులపై కచ్చితమైన గణాంకాలను తయారుచేసి, ఆ మేరకు రైతులవారీగా గుర్తించి పారదర్శకంగా టోకెన్లు జారీ చేయాలని కోరుతున్నారు.
కర్ణాటక ధాన్యంపై నిఘా పెట్టాం
కర్ణాటక నుంచి ధాన్యం తెచ్చి ఇక్కడి రైతుల పేర విక్రయిస్తున్న వైనంపై విచారణ నిర్వహిస్తున్నాం. బహిరంగ మార్కెట్లో మినహా ప్రభుత్వ కేంద్రాల్లో కర్ణాటక ధాన్యం కొనడం లేదు. క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. అక్రమాలపై సమాచారం ఇస్తే కఠినచర్యలు తీసుకుంటాం.
హాతీరాం నాయక్, సివిల్ సప్లయిస్ డీఎం, నారాయణపేట జిల్లా