కరోనా విషయంలో ప్రజల తీరుపై ప్రభుత్వం సీరియస్‌

ABN , First Publish Date - 2020-03-23T21:02:53+05:30 IST

రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగావుంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది.

కరోనా విషయంలో ప్రజల తీరుపై  ప్రభుత్వం సీరియస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగావుంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తిచేసినా ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించక పోవడంతో ప్రభుత్వం సీరియస్‌గా వుంది. ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఖాతరు చేయక పోగా రోడ్లపై యదేచ్చగా సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్‌ అమలు పై చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ అత్యవసరంగా సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపై రావడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు.


ప్రజాహితానికి చేపట్టిన బంద్‌కు సహకరించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తిచేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ 1897 యాక్ట్‌ కింద లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాము. లాక్‌డౌన్‌ వల్ల అంతరాష్ట్ర బార్డర్స్‌ మూసి వేస్తున్నాము. ఆర్టీసీ బస్సులను బంద్‌ చేయించాము. ఎమెర్జెన్సీ సేవలను మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడ 5 మంది గుమిగూడ వద్దన్నారు. కొన్నిచోట్ల నిత్యావసర వస్తువుల అమ్మకాలను అనుమతించామన్నారు. జీవో 45లో ఉన్న ప్రతి అంశాన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అన్నిపరీక్షలు వాయిదా వేశామన్నారు. రోడ్లమీద ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదన్నారు. 


రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎవరూ బయట తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు నడుస్తాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాల్లు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా బయట తిరిగితే పాస్‌పోర్ట్‌లను సీజ్‌చేస్తామన్నారు. ప్రజలు కరోనా తీవ్రతను గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతే కానీ ఇష్టారీతిగా రోడ్లపై రావద్దని ఆయన హెచ్చరించారు. ఈసందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. ప్రజారోగ్యం కోసం సోమవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ పరిమితిగా అనుమతి ఉంటుందన్నారు. ప్రైవేట్‌వాహనాలను ఎమర్జెన్సీ  పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వచ్చే వారం పదిరోజుల్లో క్రమశిక్షణతో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. తెలంగాణ సమాజం కోసం  పోలీసులు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తారని తెలిపారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. ప్రైవేట్‌ వాహనాలునిత్యావసర వస్తువుల తరలింపునకు అనుమతిస్తామన్నారు. మీడియాకు ఎక్కడైనా తిరిగేందుకు అనుమతిస్తామన్నారు. చట్టం చాలా కఠినంగా అమలు చేస్తామన్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామన్నారు. ప్రతి బైక్‌పై ఒకరిని, ఫోర్‌వీలర్స్‌ వాహనంలో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. లాక్‌డౌన్‌ పై ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 

Updated Date - 2020-03-23T21:02:53+05:30 IST