బల్దియాపై సర్కారు గురి

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్‌ నగరాభివృద్ధిపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

బల్దియాపై సర్కారు గురి

నేడు నగరాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
హాజరు కానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు


వరంగల్‌ సిటీ, డిసెంబరు 20 : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్‌ నగరాభివృద్ధిపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రధానంగా స్మార్ట్‌సిటీ, అమృత్‌, సీఎం ఆస్యూరెన్స్‌, హృదయ్‌ ప్రాజెక్టు అంశాలపై మంత్రి కేటీఆర్‌ సుదీర్ఘంగా చర్చించనున్నారు. మూడు నెలల్లో వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ నిర్వహించే సమీక్షకు ప్రాధాన్యత చేకూరింది.

గతంలో సమీక్షించిన పనుల పూర్తిపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి పెడతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి పనుల సమీక్ష ద్వారా జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు దిశా, నిర్దేశం జరుగుతుందంటున్నారు. అభివృద్ధి పనుల సమీక్ష సమావేశమైనప్పటికీ జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు, విజయావకాశాల వంటి అంశాలు కూడా మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించే అవకాశం ఉందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ తదుపరి బీజేపీ జీడబ్ల్యూఎంసీ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ ఈ అంశాలను కూడా చర్చిస్తారంటున్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడంతోనే బీజేపీపై ఆధిపత్యం ప్రదర్శించాలనే వ్యూహాంతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే  సమీక్షా సమావేశంలో పనుల పూర్తికి పక్కాగా టార్గెట్‌ ఫిక్స్‌ కానుందని గులాబీ దళం చెబుతోంది.

డివిజన్ల పునర్విభజనపై స్పష్టత
జీడబ్ల్యూఎంసీ డివిజన్ల పునర్విభజనపై కూడా మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 58 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన ద్వారా 8 డివిజన్లు పెరుగనున్నాయి. మొత్తం డివిజన్ల సంఖ్య 66కు చేరనుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా డివిజన్ల పునర్విభజన జరగాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కూడా పునర్విభజన తథ్యమంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ డివిజన్ల పునర్విభజన అంశాన్ని చర్చించి స్పష్టత ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మాస్టర్‌ప్లాన్‌ విడుదలపై స్పష్టత
మాస్టర్‌ప్లాన్‌-2041 విడుదల ఎప్పుడెప్పుడా అని వరంగల్‌ నగరం ఎదురుచూస్తోంది. గత సంవత్సర మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలోనే మాస్టర్‌ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రకటించారు. దీంతో ప్లాన్‌ అమల్లోకి వచ్చేసిందనే హంగామా జరిగింది. కానీ మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ విషయం కోల్ట్‌ స్టోరేజీలోకి వెళ్లింది. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో నేపథ్యం, 2021 నూతన సంవత్సర కానుకగా మాస్టర్‌ప్లాన్‌-2041 విడుదల చేస్తే టీఆర్‌ఎ్‌సకు మైలేజ్‌గా ఉంటుందని గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ విడుదలపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌పై ఒత్తిడి తేవాలనే నిర్ణయంతో ఉన్నారు. ఈ క్రమంలో నేటి సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌-2041 విడుదలపై స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్రారంభోత్సవాలకు ముహుర్తం

వరంగల్‌ భద్రకాళి బండ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరగాల్సి ఉం ది. మంత్రి కేటీఆర్‌ ద్వారా వీటిని ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేయాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశానికి వెళుతున్నారు.

Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST