కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-06-16T09:20:45+05:30 IST

కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చునంతా బీమా

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ప్రైవేటు ఆస్పత్రులనూ భాగస్వాముల్ని చెయ్యాలి

మరిన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి

వైరస్‌పై పోరులో ముందు వరుసలో ఉన్నవారికి

నిరంతర పరీక్షలు చేయాలి

గవర్నర్‌తో ఆన్‌లైన్‌ భేటీలో నిపుణుల అభిప్రాయాలు


హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చునంతా బీమా సంస్థలు చెల్లించేలా చర్యలు తీసుకుంటూ ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం రాజ్‌భవన్‌ నుంచి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సహా అన్ని రకాల పరీక్షలనూ వాయిదా వేయాలని, పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమైనవని ఇందులో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్స కోసం ఆన్‌లైన్‌లో వైద్యులతో సంప్రదింపులు జరిపే వీలు కల్పించాలని, టెలిమెడిసిన్‌ సౌకర్యాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు.


ప్రజాప్రతినిధులు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తక్కువ మంది అనుచరులతో వెళ్లాల్సిందిగా, కొవిడ్‌-19 జాగ్రత్తలను పాటించాల్సిందిగా సూచించాలన్నారు. కరోనా చికిత్సలో భాగంగా ఆయుర్వేదం, సిద్ధ వైద్యవిధానాల్లోని రోగ నిరోధక శక్తిని ఔషధాలను వాడటానికి వీలు కల్పించాలని సూచించారు. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ధ్యానంతో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని.. కాబట్టి, ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత వంటి అంశాలపై నిరంతర ప్రచారం చేయాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే గిరిజనులను, పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చికిత్సను వికేంద్రీకరించాలని, మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సను అందించాలని, వైద్యుల నియామకం చేపట్టాలని వారు సూచించారు.


కరోనాపై పోరులో ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పరీక్ష, చికిత్సల చార్జీలను నియంత్రించాలని, కరోనా చికిత్సల నిమిత్తం ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనాలు కలిగినందున ఆ దిశగా తగిన ప్రణాళికలు రూపొందించాలని, పాత్రికేయులందరికీ కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడి చేసే వారిపై కఠిన మైన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసులు, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులు, శానిటరీ కార్మికులు... ఇలా కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వారికి నిరంతరం పరీక్షలు చేయాలన్నారు.


రెడ్‌జోన్‌లలో లక్షణాలు లేకున్నా పరీక్షలు

రెడ్‌జోన్‌లు, హాట్‌స్పాట్స్‌లో ప్రజలకు.. లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయాలని, హాట్‌స్పాట్స్‌లో పూల్‌ టెస్టింగ్‌ చేయాలని సూచించారు. దీనివల్ల సామాజికవ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. యాంటీ బాడీ పరీక్షల ద్వారా సామాజిక వ్యాప్తిని గుర్తించవచ్చన్నారు. సంచార పరీక్షా కేంద్రాలను పెంచాలని.. పరీక్షల విధానాన్ని హేతుబద్ధీకరించాలని.. ‘పరీక్షించు.. గుర్తించు... చికిత్స చేయి(టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌)’ అనే ఫార్ములాను పాటించాలని సూచించారు. గవర్నర్‌తో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, కేంద్ర వైద్య శాఖ పూర్వ కార్యదర్శి కె.సుజాతారావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, డాక్టర్‌ హరిప్రసాద్‌ (అపోలో ఆస్పత్రి), డాక్టర్‌ విజేందర్‌రెడ్డి(ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు), డాక్టర్‌ స్వామినాథన్‌ (కొవిడ్‌ వైద్య నిపుణుడు), కె.వంశీమోహన్‌ (ఫ్లాస్మా థెరపీతో వైద్యం చేయించుకున్న తొలి కరోనా పేషెంట్‌) ఉన్నారు.


విద్యార్థులకు నాలుగు ‘ఈ’లే ప్రధానం: గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాలుగు ‘ఈ’లు ప్రధానంగా యూనివర్సిటీలు పని చేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. ఎంజాయ్‌, ఎడ్యుకేట్‌, ఎంప్లాయ్‌మెంట్‌, ఎంపవర్‌ అనే నాలుగు ‘ఈ’లను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యను అందించాలన్నారు. నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీపై సోమవారం ఆమె రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఇతర అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల బలహీనతలు, బలాలను గుర్తించి తదనుగుణంగా విద్యను అందించాలని సూచించారు.  ర్యాంకింగ్‌లో యూనివర్సిటీ వెనుకబడడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగతా వర్సిటీల మాదిరిగా విద్యను అందించడంలో ముందడుగు వేయాలని సూచించారు. 

Updated Date - 2020-06-16T09:20:45+05:30 IST