‘ఆసరా’లో అక్రమాలపై సర్కారు సీరియస్
ABN , First Publish Date - 2020-12-13T07:40:26+05:30 IST
ఆదిలాబాద్ జిల్లాలో ఆసరా పథకంలో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘

ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల విచారణ..
గ్రామ కార్యదర్శి సస్పెన్షన్‌కు సిఫార్సు
ఆదిలాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో ఆసరా పథకంలో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఊతకర్రకు చెదలు’’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించింది. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఆదేశించారు. వెంటనే స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు అక్రమాలపై ఆఘమేఘాల మీద విచారణ జరిపి ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
బోథ్ మండలం గుట్టపక్క తండా గ్రామానికి చెందిన చౌహాన్ యశోదబాయికి సంబంధించిన ఆసరా డబ్బులను గ్రామ కార్యదర్శి తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీఆర్‌డీఏ పీడీ రాథోడ్ రాజేశ్వర్.. జిల్లా పంచాయతీ అధికారికి సిఫార్సు చేశారు.
కలెక్టర్ ఆమోదంతో త్వరలోనే గ్రామ కార్యదర్శిపై వేటు పడే అవకాశం ఉంది. మిగతా మండలాల్లో జరిగిన ఆసరాలో అక్రమాలపైనా విచారణ కొనసాగుతోంది.
