ఇలా సాగుదాం!

ABN , First Publish Date - 2020-05-24T07:33:39+05:30 IST

పునాస పంటల విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలని ..

ఇలా సాగుదాం!

 • 1.3 కోట్ల ఎకరాల్లో పునాస.. వ్యవసాయ ప్రణాళిక సిద్ధం
 • వాణిజ్య పంట పత్తికే పెద్దపీట
 • 10 లక్షల ఎకరాల్లో జొన్న, పెసలు, మినుములు, పల్లీ, చెరుకు, సోయా
 • రాష్ట్రంలో ఖరారైన పంటల సాగు
 • సీఎం చెప్పిన లెక్కల్లో మార్పులు
 • ఐదు లక్షల ఎకరాలు తగ్గిన పత్తి
 • 1.76 లక్షల ఎకరాలు పెరిగిన వరి 
 • 2.49 లక్షల ఎకరాలు తగ్గిన కంది
 • మరో 3 రోజులు రైతు సదస్సులు  
 • 208 ఏఈవో పోస్టుల భర్తీ
 • వ్యవసాయ శాఖలో సెలవులు రద్దు

ఏ జిల్లాలో ఏ పంటకు ప్రాధాన్యం

పత్తి: సిద్దిపేట, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, భూపాలపల్లి, యాదాద్రి, కొత్తగూడెం

వరి: జగిత్యాల, ఇందూరు, వనపర్తి, మెదక్‌, కామారెడ్డి, 

కంది: నల్లగొండ, వనపర్తి, నిర్మల్‌, కామారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, ఆసిఫాబాద్‌


పత్తి 65 లక్షలు

వరి 42 లక్షలు 

కంది 12.5 లక్షలు


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): పునాస పంటల విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పునాసలో సాగుచేయాల్సిన ప్రధాన పంటల విస్తీర్ణాన్ని ఎకరాల వారీగా ప్రకటించింది. ఈ వానాకాలంలో మొత్తం 1.3 కోట్ల ఎకరాల్లో పంటలు వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఊహించినట్లే తెల్లబంగారం అయిన పత్తి పంట సాగుకే పెద్ద పీట వేసింది. 65 లక్షల ఎకరాల్లో పత్తి, 41,76,778 ఎకరాల్లో వరి, 12,51,958 ఎకరాల్లో కంది పంటలు వేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు నివేదికల ఆధారంగా సాగు చేయాల్సిన పంటల రకాలను, విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పంటల సమగ్ర విధానాన్ని ప్రకటించారు.


ప్రధాన పంటలు విస్తీర్ణం పోనూ మిగతా 10లక్షల ఎకరాల్లో జొన్న, పెసలు, మినుములు, ఆముదం, వేరుశనగ, చెరుకు, సోయాబీన్‌ వంటి పంటలను రైతులు వేస్తారని నిరంజన్‌ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ పునాసలో 70లక్షఽల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని ఇటీవల ప్రకటించారు. తాజా నివేదికలో మాత్రం సీఎం చెప్పిన దానికన్నా పత్తి విస్తీర్ణం 5లక్షల ఎకరాలు తక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగూడెం, మంచిర్యాల వంటి జిల్లాల్లో స్థానిక వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వరి విస్తీర్ణం కంటే పత్తి విస్తీర్ణాన్ని పెంచారు. ఖమ్మం జిల్లాలో గత  సీజన్‌ కన్నా పత్తి విస్తీర్ణాన్ని తగ్గించి కంది విస్తీర్ణాన్ని పెంచారు. నిర్మల్‌ జిల్లాలో కంది పంట కంటే సోయాబీన్‌ను ఎక్కువ విస్తీర్ణంలో పండించాలని ప్రతిపాదించారు. వరి పంట విషయంలో సీఎం వెల్లడించిన వివరాల కంటే 1.76 లక్షల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. వరిలో సన్నాలను ఎక్కువగా పండించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.


నీటి వసతి తక్కువగా ఉన్న యాదాద్రి-భువనగిరి వంటి కొన్ని జిల్లాల్లో సన్నాలకంటే దొడ్డు రకాలనే 60 శాతం వరకు పండించాలని నిర్ణయించారు. సాగర్‌ అయకట్టు ఉన్న సూర్యాపేట జిల్లాలో 82 శాతం సన్నాలకే ప్రాధాన్యమిచ్చారు. సోయాబీన్‌, ఆముదం, జొన్న, పెసలు, మినుములు, వేరుశనగ, చెరుకు వంటి పంటలకు ప్రాధాన్యమివ్వడం వల్ల కంది విస్తీర్ణం తగ్గింది. సీఎం 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేయాలని చెప్పగా 12.51 లక్షల ఎకరాలకు వ్యవసాయ శాఖ పరిమితం చేసింది. కాగా పంటల సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే నియంత్రిత సాగు విధానంపై క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు కూడా ఈ సదస్సులు జరగనున్నాయి.


ఈ కారణంగా వ్యవసాయాధికారులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. జిల్లాలకు బాధ్యులుగా ఉన్న మంత్రుల ఆధ్వర్యంలో రైతుబంధు సమితుల ప్రతినిధులు, వ్యవసాయాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, పీఏసీఎ్‌సల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.


విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఈ వానాకాలం సీజన్‌లో పంటల విస్తీర్ణానికి అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే వానాకాలం కోసం కేంద్రం రాష్ట్రానికి 22.30 లక్షల టన్నుల ఎరువులను కేటాయించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలన్నారు. 


208 ఏఈవో పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో 208 వ్యవసాయ విస్తరాణాధికారుల(ఏఈవో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 32 జిల్లాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు


Updated Date - 2020-05-24T07:33:39+05:30 IST