ఉగ్ర గోదావరి

ABN , First Publish Date - 2020-08-16T08:39:50+05:30 IST

గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద చేరుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రాణహిత నది నుంచి భారీగా...

ఉగ్ర గోదావరి

  • భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న నది..
  • కాళేశ్వరం వద్ద 10.5 మీటర్ల ఎత్తున ప్రవాహం
  • ఏటూరునాగారంలో హై అలర్ట్‌
  • మేడిగడ్డకు 5 లక్షల క్యూసెక్కులు
  • జూరాల, శ్రీశైలానికి వరద 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌:

గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద చేరుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రాణహిత నది నుంచి భారీగా వరద చేరుతుండటంతో కాళేశ్వరం వద్ద 10.5 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుంది. 12.2 మీటర్లకు చేరితే ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 5.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 57 గేట్లు ఎత్తి 5.78లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 11.67టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీలోకి మానేరు, ఇతర వాగుల నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 51 గేట్లను ఎత్తి 2లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


అన్నారం బ్యారేజీలో 8.3 టీఎంసీల నీరు ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం జలాశయంలోకి 1,45,000 క్యూసెక్కుల వరద వచ్చింది. 13 గేట్లు ఎత్తి 91,546 క్యూసెక్కులను, పవర్‌హౌస్‌ ద్వారా 31,958 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్‌ నుంచి జూరాలకు 1,25,000 క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి శనివారం 40,259 క్యూసెక్కులను విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకు 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 5 రోజులుగా నీటి విడుదల కొనసాగుతోంది. ములుగు జిల్లాలో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఏటూరునాగారంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే సీతక్క కార్యకర్తలతో కలిసి ప్రజలనుఅప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి మట్టం 43 అడుగులకు చేరడంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


మళ్లీ రివర్సే..

కాళేశ్వరం ఇంజనీర్ల అంచనాలు తలకిందలై రూ.కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నెల 5 నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా 8.2 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోశారు. ప్రస్తుతం అన్నారానికి భారీ వరద వస్తుండడంతో 2లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆగస్టులో భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేయకపోవడంతో వారం పాటు నీటిని లిఫ్ట్‌ చేసినట్లు తెలిసింది. 8.2టీఎంసీల నీటిని ఎత్తేందుకు సుమారు రూ.16కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆ నీరు మళ్లీ దిగువకు విడుదల చేయడంతో విద్యుత్‌ ఖర్చులన్నీ వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-08-16T08:39:50+05:30 IST